వారికి పరిహారం చెల్లించండి
లోక్‌సభలో రాహుల్ గాంధీ డిమాండ్
న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగించిన ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం లోక్‌సభలో ఈ అంశంపై మాట్లాడిన ఆయన మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. రైతులు, సాగు చట్టాల అంశంపై లోక్‌సభ జీరో అవర్‌లో రాహుల్ గాంధీ మాట్లాడారు ‘ ప్రధాని మోడీ తన తప్పును అంగీకరించి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అయితే ఈ ఉద్యమంతో ఎంతమంది రైతులు మరణించారని నవంబర్ 30 వ్యవసాయ మంత్రిని ప్రశ్నించగా అందుకు సంబంధించిన డేటా తమ వద్ద లేదని చెప్పారు.
కానీ సాగు చట్టాలపై జరిపిన పోరాటంలో దాదాపు 700 మంది అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారు. వారి వివరాలను సభకు అందజేస్తున్నా’ అని అన్నారు. పంజాబ్‌నుంచి దాదాపు 400 మంది రైతులు ఈ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. వారికి పంజాబ్ ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. మరణించిన వారిలో 152 కుటుంబాల వారికి ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. హర్యానాలో చనిపోయిన రైతుల జాబితా లేదని మీ ప్రభుత్వం చెబుతోంది. హర్యానాలో చనిపోయిన 70 మంది రైతులకు సంబంధించిన జాబితా కూడా నా వద్ద ఉంది’ అని రాహుల్ గాంధీ చెప్తూ ఆ జాబితాను కూడా లోక్‌సభకు సమర్పించారు. రైతు హక్కులను కాపాడాలని, చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం, ఉద్యోగాలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను’ అని ఆయన అన్నారు.