ముంబై: టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ బోర్డు వర్గాలు ధ్రువీకరించాయి. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి పదవి కాలం త్వరలో ముగియనుంది. దీంతో కొత్త కోచ్ కోసం భారత క్రికెట్ బోర్డు దరఖాస్తులను ఆహ్వానించింది. కాగా, ద్రవిడ్‌ను టీమిండియా ప్రధాన కోచ్‌గా ఎంపిక చేయాలని బిసిసిఐ భావిస్తోంది. ఇండియాఎ, అండర్19 జట్లకు ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించాడు. అంతేగాక ఇటీవల శ్రీలంకలో పర్యటించిన భారత క్రికెట్ జట్టుకు కూడా తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. కోచ్‌గా, క్రికెటర్‌గా, కెప్టెన్‌గా తన పాత్రలను ఎంతో సమర్థంగా నిర్వహించిన ఘనత ద్రవిడ్‌కు దక్కుతోంది. దీంతో టీమిండియా ప్రధాన కోచ్‌గా అతన్ని నియమించాలనే డిమాండ్ సర్వత్రా వినవస్తోంది. ఇక బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ద్రవిడ్‌కే మద్దతు తెలిపాడు. దీంతో టీమిండియా ప్రధాన కోచ్‌గా ద్రవిడ్ నియామకం దాదాపు ఖరారైందనే చెప్పాలి.
అయితే నిబంధనల ప్రకారం బిసిసిఐ కోచ్ నియామకానికి సంబంధించి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల వారు దీనికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కాగా టీమిండియా ప్రధాన కోచ్ పదవిలో భారత్‌తో పాటు విదేశాలకు చెందిన క్రికెటర్లు వినిపించాయి. టామ్ మూడీ, రికీ పాంటింగ్, మహేల జయవర్ధనేలతో పాటు వివిఎస్.లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్ తదితరులు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ టామ్ మూడీ, పాంటింగ్, జయవర్ధనేలు టీమిండియా కోచ్ పదవి చేపట్టేందుకు ఆసక్తి చూపలేదు. కుంబ్లే కూడా తాను కోచ్ పదవికి దూరంగా ఉంటున్నట్టు స్పష్టం చేశాడు. దీంతో రాహుల్ ద్రవిడ్‌ను కోచ్‌గా నియమించాలని బిసిసిఐ తుది నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం ద్రవిడ్ కూడా దీనికి దరఖాస్తు చేసుకోవడంతో అతని ఎంపిక ఖాయమని తేలిపోయింది. ఇదిలావుండగా ద్రవిడ్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో ఆ పదవిలో భారత మాజీ క్రికెటర్ వివిఎస్.లక్ష్మణ్‌ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.