కోల్‌కతా: సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తనపై చేసిన వ్యాఖ్యలకు బాధపడడం లేదని టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. అతని బాధను తాను అర్థం చేసుకోగలనని వ్యాఖ్యానించాడు. చాలా కాలం పాటు జట్టుకు సేవలు అందించిన క్రికెటర్ నుంచి ఇలాంటి ఆవేదన రావడంలో తప్పేమీ లేదన్నాడు. ప్రస్తుతం టీమిండియాలో చోటు కోసం హోరాహోరీ పోటీ నెలకొందన్నాడు. ఇలాంటి స్థితిలో జట్టు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని జట్టు యాజమాన్యం యువ ఆటగాళ్లవైపే మొగ్గు చూపడం తథ్యమన్నాడు. దీంతో సాహా వంటి సీనియర్ క్రికెటర్లకు జట్టులో చోటు అంత తేలికేం కాదన్నాడు. కాగా రిటైర్మెంట్ గురించి ఆలోచించాలని తాను అన్నట్టు సాహా పేర్కొన్నాడని, అయితే అతని వ్యాఖ్యలనై తప్పుపట్టడం లేదని ద్రవిడ్ స్పష్టం చేశాడు. ఇదిలావుండగా ద్రవిడ్‌పై, బిసిసిఐ అధ్యక్షుడు గంగూలీపై సాహా ఇటీవల చేసిన వ్యాఖ్యలు భారత్ క్రికెట్‌లో పెను ప్రకంపనలు సృష్టించాయి. అంతేగాక ఓ జర్నలిస్ట్ తనను ఇంటర్వూ కోసం బెదిరించాడని సాహా పేర్కొనడం సంచలనంగా మారింది. ఇదే సమయంలో సెహ్వాగ్, లక్ష్మణ్, రవిశాస్త్రి, హర్భజన్ తదితరులు సాహాకు మద్దతుగా నిలిచారు.
Rahul Dravid Responds on Saha’s comments