జైపూర్: టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ తన బాధ్యతలు స్వీకరించాడు. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగే మ్యాచ్ కోసం భారత్ మంగళవారం ముమ్మర సాధన చేసింది. ఇక ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించే తొలి సిరీస్ ఇదే కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచకప్ తర్వాత రవిశాస్త్రి కోచ్ పదవి కాలం ముగిసింది. దీంతో అతని స్థానంలో ద్రవిడ్‌ను ప్రధాన కోచ్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఇక మంగళవారం ద్రవిడ్ రంగంలోకి దిగాడు. తన మార్క్ శిక్షణతో ఆకట్టుకున్నాడు. చాలా సేపటి వరకు క్రికెటర్లతో పాటు మైదానంలోనే ఉండిపోయిన ద్రవిడ్ ఆటగాళ్లకు పలు మెలకువలు నేర్పించాడు. అంతేగాక కెప్టెన్ రోహిత్ శర్మకు బంతులు వేస్తూ కనిపించాడు. ఇక ద్రవిడ్ శిక్షణకు సంబంధించిన వీడియోను బిసిసిఐ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. కాగా, కెప్టెన్ రోహిత్‌తో పాటు కెఎల్.రాహుల్, రిషబ్ పంత్ తదితరులకు ద్రవిడ్ పలు సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఇక రానున్న రెండేళ్లలో ఎన్నో మెగా టోర్నమెంట్‌లు, సిరీస్‌లు జరుగనున్నాయి. దీంతో ద్రవిడ్ తనకు అప్పగించిన బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తాడనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.