Wednesday, January 22, 2025

ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం:రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: తెలంగాణ ప్రజల స్వప్నాలను సాకారం చేస్తామని అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చింది కాంగ్రెస్సేనని ఆ ఘనత తమ పార్టీకే దక్కుతుందన్నారు. ధరణి పోర్టల్ కెసిఆర్ కోసం తయారు చేసుకున్న పోర్టల్ అని తక్షణమే దానిని రద్దు చేస్తామన్నారు. తాము ఏం చేశామని మోడీ, కెసిఆర్ అంటున్నారని మీరు నడిచే రోడ్డు, మీరు చదివిన విశ్వ విద్యాలయాలు కట్టించిది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఈ విషయం దేశ ప్రజలకు తెలుసని ఆయన అన్నారు. మోడీ చెప్పిందే కెసిఆర్ చెబుతున్నారని మోడీ, కెసిఆర్, ఎంఐఎంలది ఒకే టీమ్ అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బలంగా రాష్ట్రాలలో ఎంఐఎంతో పోటీ చేయించి తాము ఓడిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో నల్లా చట్టాలను తీసుకువస్తే వాటికి కెసిఆర్ మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు.

మోడీపై తాను పోరాటం చేస్తుంటే తనపై 24 అక్రమ కేసులు పెట్టి ఎంపి సభ్యత్వాన్ని రద్దు చేశారని, 55 గంటల ఈడి విచారణ చేపట్టారని తన ఇళ్లు సైతం లాక్కోవడానికి ప్రయత్నించారని చెప్పారు. తన ఇళ్లు లాకుంటే దేశంలో తనకోసం కోట్లాది ప్రజల ఇండ్లు ఉన్నాయని అన్నారు. బిసిని సిఎం చేస్తామని అంటున్న బిజెపి ముందు ఎన్నికల్లో గెలవాలని తరువాత సిఎం అని ఎద్దేవా చేశారు. బిఆర్‌ఎస్‌కు చెందిన కారు నాలుగు టైర్లు పంచర్ అయ్యాయని బిఆర్‌ఎస్, బిజెపిల పని అయిపోయిందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ఆరు గ్యారంటీల ద్వారా తెలంగాణ ప్రజలు ఎంతో లబ్ధిపొందుతారని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఆసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని రాహుల్‌గాంధీ ధీమా వ్యక్తం చేశారు. పిసిసి ఛీప్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ దేశం మొత్తం కామారెడ్డి వైపు చూస్తుందని కామారెడ్డిలో కాంగ్రెస్‌ను పట్టం కట్టాలని ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, నాయకులు వేణుగోపాల్, షబ్బీర్ అలీ, మహేష్‌కుమార్ గౌడ్, యూసుఫ్ అలీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మదన్‌మోహన్ రావు, ఏనుగు రవీందర్ రెడ్డి, లక్ష్మీకాంతరావు తదితరులు పాల్గొన్నారు.

ఆరు గ్యారంటీ పథకాలను మొదటి కేబినెట్‌లోనే చట్టాలు మారుస్తాం : రాహుల్ గాంధీ
సంగారెడ్డిలోని గంజి మైదాన్‌లో ఆదివారం ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ విజయభేరి సభ జరిగింది. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలను మొదటి కేబినెట్‌లోనే చట్టంగా మారుస్తామని తెలిపారు. బిజెపి, బిఆర్‌ఎస్, ఎంఐఎం ఒక్కటేనని రాహుల్ విమర్శించారు. కేంద్రంలో బిజెపి ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు బిఆర్‌ఎస్ మద్దతు పలికిందన్నారు. దొరల పాలనకు అంతం పలికి ప్రజా పాలన తేవడమే కాంగ్రెస్ లక్షమని అన్నారు. తెలంగాణాలో పాఠశాలలను, విద్యా సంస్థలను ప్రైవేటు పరం చేయడం ద్వారా పేదలకు విద్యను దూరం చేస్తున్నారని మండి పడ్డారు. తొలుత తెలంగాణాలో అధికారంలోకి వస్తామని, ఆ తర్వాత కేంద్రంలో ఢిల్లీలో బిజెపిని ఓడిస్తామని చెప్పారు. సంగారెడ్దిలో జగ్గారెడ్డి పెద్ద పులిలాంటి వాడని, కష్టపడి పని చేస్తాడని, అతన్ని గెలిపించాలని కోరారు. 28వ తేదీన తాను పెద్ద సభ ఏర్పాటు చేస్తానని ఆరోజు అన్ని విషయాలు మాట్లాడుతానని జగ్గారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి నాయకుడు జెట్టి కుసుమ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మళ జగ్గారెడ్డి, యూత్ కాంగ్రెస్ సెక్రటరీ జయారెడ్డి, నాయకులుతో పాజి అనంతకిషన్, కూన సంతోష్, జార్జ్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News