గ్యాస్ ధరల పెంపుపై రాహుల్‌గాంధీ, మమత ధ్వజం
న్యూఢిల్లీ: వంటగ్యాస్ సిలిండర్ ధర పెంచడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కోట్లాది కుటుంబాలు విపరీతంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణం నిరుద్యోగం, అసమర్థ పాలనతోఅవస్థలు పడుతున్నారని అన్నారు. పెంచిన వంటగ్యాస్ ధరలను తగ్గించాలని, 2014లో ఉన్న సబ్సిడీ సిలిండర్ ధర స్థాయికి తీసుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.414ఉండేదని, ప్రభుత్వం ప్రతి సిలిండర్‌పైన రూ.827 సబ్సిడీ ఇచ్చేదని రాహుల్ గుర్తు చేశారు. ‘ ఇప్పుడు సిలిండర్ ధర రూ.999కు చేరింది. ఇచ్చే సబ్సిడీ మొత్తం జీరో’ అని ఆయన అన్నారు. సామాన్య ప్రజలను కాపాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన అన్ని రక్షణలను నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలగించిందని ఆయన అన్నారు. ఈ రోజు కోట్లాది కుటుంబాలు విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణ నిరుద్యోగం, అసమర్థ పాలనతో ఎదురీదుతున్నాయి’ అని ఆయన ఓఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఇలా జరగనిచ్చేది కాదు, మేము ఎప్పుడూ కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా ఉన్నాం’ అని ‘ మెహంగాయి ముక్త్ భారత్’, ‘బిజెపి ఫెయిల్స్‌ఇండియా’ అన్న హ్యాష్‌ట్యాగ్‌లు జత చేసిన ఆ పోస్టులో రాహుల్ అన్నారు. ఎనిమిదేళ్ల మోడీ ప్రభుత్వ హయాంలో వంటగ్యాస్ సిలిండర్ ధరలు రూ.585 పెంచారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా విమర్శించారు. కాగా వంటగ్యాస్ ధరలను క్రమం తప్పకుండా పెంచడం ద్వారా ప్రభుత్వం దేశ ప్రజలను చిత్ర హింసలకు గురి చేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దుయ్యబట్టారు. పెట్రోలియం ధరలు, వంటగ్యాస్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలను పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలను దోచుకుంటోందని మమత ఆ ట్వీట్‌లో దుయ్యబట్టారు.