సూరత్: గుజరాత్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే దాఖలు చేసిన పరువు నష్టం దావాలో తన వాంగ్యూలాన్ని నమోదు చేయడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం సూరత్‌లోని ఒక మెజిస్ట్రేట్ కోర్టులో హాజరయ్యారు. మోడీ అనే ఇంటిపేరు గల వ్యక్తులను కించపరిచే విధంగా తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ కోర్టుకు తెలియచేశారు.
మోడీ అనే ఇంటిపేరు ఉన్న వ్యక్తులను వారి పరువునష్టం కలిగించే విధంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారంటూ సూరత్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ కోర్టులో పరువునష్టం దావా వేశారు. కాగా, ఈ ఆరోపణలను రాహుల్ తోసిపుచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్నాటకలోని కోలార్‌లో ఒక ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగిస్తూ మోడీ ఇంటిపేరు ఉన్న వారిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేశానన్న ఆరోపణలను ఆయన ఖండించారు.
ఒక పారిశ్రామిక వేత్తకు ప్రధాని నరేంద్ర మోడీ రూ. 30 కోట్లు ఇచ్చారని మీరు ఆరోపించారా అని రాహుల్ గాంధీని సూరత్ చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్(సిజెఎం) ఎఎన్ దావే ప్రశ్నించగా ఒక జాతీయ నాయకుడిగా దేశ హితం కోరి అవినీతి, నిరుద్యోగం వంటి సమస్యలను ప్రస్తావించే హక్కు తనకు ఉందని ఆయన సమాధానమిచ్చారు. మోడీ అనే ఇంటిపేరు ఉన్నవారందరూ దొంగలని మీరు అన్నారా అని డిజెఎం ప్రశ్నించగా తాను అటువంటి మాటలేవీ అనలేదని రాహుల్ బదులిచ్చారు. సాక్ష్యాలు, సాక్షుల వాంగ్యూలాలకు సంబంధించిన అనేక ప్రశ్నలకు రాహుల్ తనకు తెలియదంటూ సమాధానాలిచ్చారు. రాహుల్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న సిజెఎం కేసు తదుపరి విచారణను జులై 12వ తేదీకి వాయిదా వేశారు.