Monday, December 23, 2024

పార్లమెంటులో ఎన్నికల అజెండా!

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చల సరళిని గమనిస్తే 2024 ఎన్నికల ప్రచారం తీరుతెన్నులను సూచిస్తున్నది. ముఖ్యంగా లోక్ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నేతల ప్రసంగాలు, ఉభయ సభలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం ఈ అంశాన్ని వెల్లడి చేస్తుంది. ప్రతిపక్షాలు ఒక వంక పలు అంశాలపై నిలదీస్తుంటే, వాటికి తగురీతిలో స్పందించడం ద్వారా కాకుండా, ఎదురుదాడితో వారి నోరు మూయించే ప్రయత్నం నేడు వెల్లడవుతుంది.

గతంలో ఎన్నడూ లేనంత దూకుడుగా ప్రతిపక్షాలపై ప్రధాని శివమెత్తిన్నట్లు మాట్లాడారు. ముఖ్యంగా కనీసం ప్రతిపక్ష స్థాయి కూడా లేని కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. చివరకు ఇంటి పేరుగా నెహ్రూ పేరు పెట్టుకోలేదే అంటూ వ్యక్తిగత విమర్శలకు సహితం దిగారు. రాబోయే రోజులలో తమ ప్రభుత్వం విధి, విధానాలు, నేడు దేశం ఎదుర్కొంటున్న కీలక సమయాలపై తమ దృష్టికోణం వంటి అంశాలను ప్రస్తావించే ప్రయత్నం చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. భారత స్వాతంత్య్ర 75వ సంవత్సర ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటున్న సమయంలో రిపబ్లిక్ డే నాటి నుండి వరుసగా ఎదురవుతున్న ఎదురు దెబ్బలతో ఈ ప్రభుత్వం ఒక విధంగా నిస్సహాయస్థితిలో చిక్కుకుంటుందా? అనే అనుమానాలు ఈ సందర్భంగా కలుగుతున్నాయి. వాస్తవానికి ప్రజాదరణలో గాని, రాజకీయ బలంలో గాని మోడీని సవాలు చేయగల పార్టీ, నేత నేడు దేశంలో లేరు. అయినా ఆయనను ఒక విధమైన అభద్రతా భావం వెంటాడుతున్నట్లు ఆయన ప్రసంగం తీరుతెన్నులు సంకేతం ఇస్తున్నాయి.

ప్రజాస్వామ్యానికే భారత్ పుట్టినిల్లుగా చెప్పుకొంటున్న సమయం లో, అమృత్ కాల్ సమయంలో రిపబ్లిక్ డే కు ఓ నియంత రాజ్యాధినేత ముఖ్యఅతిధిగా హాజరు కావడం ఈ సందర్భంగా మన ప్రాధాన్యత ఆలోచించుకోవలసిన అవసరాన్ని వెల్లడి చేస్తుంది. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తాహ్ ఎల్-సిసి తీవ్రమైన అణచివేత విధానాలను అమలు పరుస్తున్నారు. తమ దేశపు రాజ్యాంగాన్ని బుట్టదాఖలు చేసిన వ్యక్తికన్నా మరొకరు ఇటువంటి సందర్భంలో విదేశాంగ శాఖకు అతిధిగా ఆహ్వానించేందుకు స్ఫురణకు రాలేదా? ఇక ఇదే సమయంలో బిబిసి డాక్యుమెంటరీ విషయంలో ప్రభుత్వం అతిగా వ్యవహరించి ఒక విధంగా అప్రతిష్ఠను మూటగట్టుకున్నదని పలువురు భావిస్తున్నారు. గత 20 ఏళ్లుగా చేస్తున్న ఆరోపణలే తప్ప కొత్తవి ఏవీ వాటిల్లో లేవు. ఆ ఆరోపణలను తిప్పికొట్టేందుకు మరింత నాగరీకమైన పద్ధతిని ఎన్నుకొని ఉంటె హుందాగా ఉండెడిది. ప్రతికూల కథనాలను వ్యాప్తి చేసే మీడియాను నిషేధాలతో ఎదుర్కోవడం నాగరికమైన ప్రజాస్వామ్య సంస్కృతి కాబోదు. పైగా, ఈ డాక్యుమెంటరీలలో ప్రధాని మీడియా సలహాదారుడైన ప్రముఖ జర్నలిస్ట్ స్వపన్ దాస్ గుప్తా సహితం మోడీపై ఆరోపణలను కొట్టిపార వేస్తూ బలమైన వాదన చేయడం గమనార్హం.

కాగా, బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ లీడ్ రోల్‌లో నటించిన పఠాన్‌సినిమా వివాదాలు, బహిష్కరణ పిలుపుల మధ్య అంచనాలకు అందని విధంగా ఘన విజయాన్ని సొంతం చేసుకోవడం సహితం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. ప్రజల మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలో, డైలాగులో, దుస్తులో, దృశ్యాల్లో ఉన్నాయంటూ సినిమాలను బాయ్ కాట్ చేయాలనే పిలుపులు ఈ మధ్య కాలంలో భారత్‌లో ఎక్కువయ్యాయి. ఇలాంటి కొన్ని వివాదాలు కొన్నిసార్లు ఆయా సినిమాల విజయాలకు దోహదపడ్డాయి. మరికొన్ని సార్లు సినిమా ఫ్లాప్ కావడానికి కూడా కొంత వరకు కారణమయ్యాయి. ఏదేమైనా, బిబిసి డాక్యుమెంటరీ, పఠాన్ సినిమా విషయాలలో మనం ఒక గుణపాఠంను గ్రహించాలి. నిషేధాల ద్వారా సినిమాలు, మీడియాలను కట్టడి చేయడం కన్నా వ్యవస్థీకృతమైన ఏర్పాట్ల ద్వారా చట్టాన్ని అమలు పరచే ప్రయత్నం చేయడం నాగరీకమైన సాధనంగా మారాలని గ్రహించాలి.

వాస్తవానికి నిషేధించే ప్రయత్నాలే బిబిసి డాక్యుమెంటరీ, పఠాన్ సినిమాలకు విశేష ప్రచారం కల్పించాయి. లేనిపక్షంలో ప్రజలలో అవంతగా ఆసక్తి కలిగించేవి కావు. భావోద్వేగ రాజకీయాలు అన్ని సమయాలలో ఆశించిన ఫలితాలు ఇవ్వలేవు. సుపరిపాలన మాత్రమే విస్తృత ప్రజాప్రయోజనాలు నెరవేర్చగలదు. ఈ అంశం పై ప్రధాని మోడీ సహితం గత నెలలో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రస్తావిస్తూ పార్టీ శ్రేణులను సున్నితంగా మందలించారు. ప్రజా సమస్యలను వదిలివేసి సినిమాలు వంటి విషయాలపై దృష్టి సారింపవద్దని హితవు చెప్పారు. తాజాగా దేశాన్నే కాకుండా మొత్తం ప్రపంచంలోనే కలకలం సృష్టిస్తున్న అదానీ వ్యవహారంపై ప్రధాని దేశ ప్రజలకు భరోసా ఇచ్చేందుకు పార్లమెంట్ వేదికను ఉపయోగించుకొని ఉంటె సముచితంగా ఉండెడిది. కానీ ఆ ప్రస్తావనే తీసుకు రాలేదు. పైగా ఈ విషయమై ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లక్ష్యంగా తన సుదీర్ఘ ప్రసంగం సాగించారు.

రాహుల్ గాంధీ ప్రసంగంలో సహితం కొత్తగా ఎటువంటి ఆరోపణలు చేయలేదు. సంవత్సరాలుగా దేశ ప్రజల ముందు, చివరకు బిజెపి మద్దతుదారుల ముందు కూడా ఉంటున్న ఆరోపణలే ప్రస్తావించారు. ఏకంగా 18 అంశాలను లోక్‌సభ రికార్డుల నుండి తొలగించడం ద్వారా దేశప్రజలకు ఈ ప్రభుత్వం ఎటువంటి సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది? అనే ప్రశ్న తలెత్తుతుంది. కేవలం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రమే రాజ్యసభలో ప్రతిపక్షాల ఆరోపణలను ప్రస్తావిస్తూ తమ ప్రభుత్వం కేవలం ‘ఒక వ్యక్తి’ కోసం పని చేయడం లేదని, మొత్తం దేశం కోసం పని చేస్తున్నదని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి మోడీకి గుడ్డిగా మద్దతు ఇస్తున్న అనేక మందికి సహితం సముచితంగా లేదని చెప్పాలి.
తనపై వచ్చిన తీవ్రమైన ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కొనేందుకు అదానీ సిద్ధపడటం సంతోషకరం. అయితే, ఈ సందర్భంగా మన నియంత్రణ సంస్థలు ఎంత బలహీనంగా ఉన్నాయో అనే అనుమానాలు దేశంలో అత్యున్నత న్యాయ స్థానానికి కూడా కలగడం చూశాము. అవి స్వతంత్రించి పని చేసే విధంగా చూడవలసిన అవసరం కూడా ఈ సందర్భంగా ప్రస్తావించింది. దేశభక్తి, విదేశీ కుట్ర వంటి పడికట్టు భావోద్వేగ పదజాలాలతో జరిగిన పొరపాట్లను సరిదిద్దడం సాధ్యం కాదు. అదానీ గ్రూప్‌పై వస్తున్న కీలకమైన ఆరోపణలు ఎస్‌బిఐ, ఎల్‌ఐసి వంటివి ఏవిధంగా పెట్టుబడులు సమకూరాయి? అని కాదు. ఊహాజనిత పెట్టుబడుల ప్రవాహాన్ని చూపి సాధారణ ప్రజలను మోసం చేసి, తమ షేర్‌లకు గిరాకీ పెంచుకొని, వంచించారనే విమర్శలు చెలరేగాయి. అదే విధంగా విదేశాలలో నకిలీ కంపెనీలు సృష్టించి మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు చేశారు.

ఏదేమైనా ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలు, అవి సృష్టించిన ఆర్ధిక విధ్వంసం ప్రభావం రాజకీయ పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటు, వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలలో ఓ ప్రధాన ప్రచార అస్త్రంగా ఎంచుకునేందుకు ప్రతిపక్షాలు సమాయత్తం అవుతున్నట్లు పార్లమెంట్ చర్చల సరళి వెల్లడిస్తున్నది. పారదర్శకత ప్రజాస్వామ్య మనుగడకు కీలకమైన అంశం కాగలదు. వ్యక్తుల గోప్యతకు ప్రాధాన్యత ఇస్తూనే కీలకమైన పరిపాలన అంశాల విషయంలో దాపరికం చూపవలసిన అవసరం లేదు. చట్టబద్ధ్దమైన సంస్థల ద్వారా విచారణ జరిపించి అనుమానాలకు ఆస్కారం లేకుండా చేయడం అవసరం కాగలదు. ప్రధాన మంత్రి డిగ్రీకి సంబంధించిన అంశాలను వెల్లడించడం ఆయన ‘వ్యక్తిగత గోప్యత’కు సంబంధించిన అంశంగా గుజరాత్ హైకోర్టులో వాదించడానికి ఆ మేరకు అర్ధం చేసుకోవచ్చు. కానీ, ఆర్ధిక అక్రమాలు, చట్టబద్ధ సంస్థల పనితీరులో గోప్యత వాంఛనీయం కాదు.

న్యాయమూర్తుల నియామకంలో కొలీజియం పరిగణించే అంశాల విషయంలో ‘గోప్యత’ పాటించడం నేడు విమర్శలకు గురవుతూ ఉండటం ఈ సందర్భంగా గమనార్హం. కేవలం న్యాయమూర్తులనే కాకుండా చట్టబద్ధమైన ఎన్నికల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త వంటి అన్ని సంస్థలకు జరిపే నియామకాలలో పరిగణించిన అంశాలను బహిరంగపరచడం మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం కావించగలదు.

నేడు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రాజకీయ పార్టీలకు సమకూరుతున్న విరాళాలు ఎవ్వరు, ఎవ్వరికీ ఇస్తున్నారో ‘గోప్యంగా’ ఉంచుతున్నాము. ఇక్కడి నుండే దేశంలో అవినీతికి బీజం పడుతున్నదని చెప్పవచ్చు. ఇటీవలనే దిగవంతులైన మాజీ న్యాయశాఖ మంత్రి శాంతి భూషణ్ ప్రధాన న్యాయమూర్తులుగా పని చేసిన వారిలో ఎనిమిది మంది అవినీతి పరులంటూ సాక్ష్యాధారాలతో సహా సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తాను చేసిన ఆరోపణలు నిరాధారం అనుకొంటే తనపై ‘కోర్టు ధిక్కరణ’ చర్యలు తీసుకోమని కూడా కోరారు. అయినా, అత్యున్నత న్యాయస్థానం ఇంతవరకు స్పందించలేదు. ఏదేమైనా మౌలిక అంశాలపై దృష్టి సారించి, దేశాభివృద్ధిలో గుణాత్మక మార్పు తీసుకు రాగాల విధానాల గురించి ఆలోచించే తీరిక, సామర్ధ్యం దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలకు లేదని పార్లమెంట్‌లో ప్రసంగాల సరళి వెల్లడి చేస్తుంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు పరిమితమవడం గమనార్హం.

* చలసాని నరేంద్ర- 9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News