Monday, December 23, 2024

రాహుల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపిగా రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. మోడీ ఇంటిపేరును దుర్భాషలాడారని రాహుల్ గాంధీపై సూరత్ కోర్టు ఆయనకు శిక్ష విధించడం, తరువాత ఆయన ఎంపి సీటుపై లోక్‌సభ స్పీకర్ వేటు వేయడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఊరట కల్పించిన నేపథ్యంలో తిరిగి ఎంపిసీటు దక్కింది. కేరళ వాయనాడ్ ఎంపిగా రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం సోమవారం అధికారిక ప్రకటన వెలువరించింది. ఇప్పటి వరకూ అమలులో ఉన్న ఎంపి అనర్హత వేటు ఇక రద్దు అయినట్లే అని, ఆ తరువాతి న్యాయవిచారణలు, జుడిషియల్ తీర్పులను పరిశీలించి తదనంతర నిర్ణయాలు ఉంటాయని , తిరిగి ఇప్పుడు ఆయన ఎంపిగా చెల్లుబాటులోకి వచ్చినట్లే అని ఈ నోటిఫికేషన్‌లో తెలిపారు. సుప్రీంకోర్టు నుంచి వెలువడ్డ స్టే సంబంధిత పత్రాలను కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ కార్యాలయానికి అందించడంతో వీటిపై స్పీకర్ పరిశీలన జరిగింది.

తరువాత సంబంధిత పత్రాలపై సోమవారం స్పీకర్ సంతకాలతో ఎంపి సీటు పునరుద్ధరణ ప్రక్రియకు అనుమతి దక్కింది. ఎంపిగా రాహుల్ సభ్యత్వ పునరుద్ధరణ కాంగ్రెస్‌లో సంతోషానికి దారితీసింది. మంగళవారం ప్రధాని మోడీ ప్రభుత్వంపై ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం చర్చ జరిగే అవకాశం ఉన్న దశలోనే ప్రతిపక్ష ప్రధాన కేంద్ర బిందువుగా ఉన్న రాహుల్ నాలుగునెలల విరామం తరువాత తిరిగి లోక్‌సభకు ఎంపిగా రానుండటం ప్రతిపక్షాలకు ఉత్సాహకారకం అయింది. సభ్యత్వ పునరుద్ధరణ ప్రకటన గురించి తెలియగానే రాహుల్ గాంధీ లోక్‌సభకు వెళ్లారు. ముందుగా పార్లమెంట్ భవనం వెలుపల ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట మౌనంగా నిలబడి పుష్పగుచ్చాలుంచి నివాళులు అర్పించారు. మధ్యాహ్నం సభకు హాజరయ్యారు. అయితే ఆయన వెళ్లిన కొద్ది నిమిషాలకే మణిపూర్ విషయంపై ప్రతిపక్షాల పట్టు దశలో సభ వాయిదా పడింది. సోమవారం రాహుల్ గాంధీ పార్లమెంట్‌కు రాగానే కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల ఎంపిలు ఆయనను కలుసుకుని అభినందించారు.

ప్రధాన ద్వారం వద్ద కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు రాహుల్ గాంధీ జిందాబాద్ అంటూ నినాదాలకు దిగారు. స్వీట్ల పంపిణీ జరిగింది. లోక్‌సభలో ఆయన తల్లి, పార్టీ సీనియర్ అయిన సోనియా గాంధీతో కొద్ది సేపు ముచ్చటించారు. రాహుల్ తిరిగి ఎంపికావడం పట్ల పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే హర్షం వ్యక్తం చేశారు. ఇది మంచి పరిణామం అని, ప్రజలకు భారీ ఊరట దక్కిందని, ప్రత్యేకించి వాయనాడు ప్రజలకు ఇది కీలక ఘట్టం అని స్పందించారు. కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ, కేసి వేణుగోపాల్ , అఖిలేష్ యాదవ్, డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా ఇతరులు హర్షం వ్యక్తం చేశారు.

మంగళవారం సభలో రాహుల్ కీలక ప్రసంగం చర్చను షురూ చేసేది ఆయనే ?
మంగళవారం లోక్‌సభలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పట్ల జరిగే చర్చలో ప్రతిపక్షాల తరఫున మాట్లాడే వారిలో రాహుల్ ప్రధానంగా ఉంటారని వెల్లడైంది. అవిశ్వాస తీర్మానం ఫలితం బలాల బేరీజు దశలో ఇప్పటికే ఖరారు అయినా, చర్చ దశలో మోడీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ప్రతిపక్షాల దాడికి ఇది అందివచ్చిన అవకాశం కానుంది. ప్రధాని మోడీ వ్యవహారశైలిపై ఈ చర్చ దశలో తీవ్రస్థాయి స్పందనకు రాహుల్ గాంధీ సమాయత్తం అవుతున్నారు. రాహుల్‌తోనే అవిశ్వాసంపై చర్చ ఆరంభం అవుతుందని వెల్లడైంది.

తొందరపడొద్దు దోషవిముక్తి జరగలేదు
రాహుల్ సభ్యత్వంపై బిజెపి స్పందన
ఇప్పటికైతే రాహుల్ తిరిగి ఎంపి అయినట్లే అని కానీ ఆయన దోష విముక్తి జరగలేదని బిజెపి ఎంపి సుశీల్ కుమార్ మోడీ స్పందించారు. గుజరాత్ కోర్టుల్లో ఇప్పటికీ కేసు పెండింగ్‌లో ఉందన్నారు. ఇప్పటికీ ఆయన దోషిత్వంపై కేవలం స్టే వెలువడిందని, నిర్దోషిగా తేల్చలేదని తెలిపారు. పైగా సుప్రీంకోర్టు తన ఆదేశాల దశలో రాహుల్‌ను గట్టిగా మందలించిందని , రాజకీయాల్లోని వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సరికాదని, ఇక ముందు సరిగ్గా మాట్లాడాల్సి ఉందని ధర్మాసనం తెలిపిన విషయాన్ని గుర్తించాల్సి ఉందన్నారు. ఇంతకు ముందు కూడా ఆయన ఎంపిగా ఉన్నారు. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఓడుతూ పోయింది. ఇప్పుడు ఆయన తిరిగిరాకతో ఆ పార్టీ మరీ సంబరపడిపోవల్సింది ఏమీ లేదన్నారు.
ట్విట్టర్‌లో రాహుల్ బయోమార్పు
డిస్ క్వాలిఫైడ్ ఎంపిగా కొత్తకూర్పు
ఇప్పటివరకూ రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో పరిచయ ప్రధానంగా ఉన్న డిస్‌క్వాలిఫైడ్ ఎంపి పదాన్ని సోమవారం రాహుల్ కొద్దిగా మార్చారు. దీనిని ఇప్పుడు డిస్ క్వాలిఫైడ్ ఎంపిగా చూపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News