Wednesday, January 22, 2025

రాహుల్ ఒంటరి ప్రయాణం!

- Advertisement -
- Advertisement -

దేశంలో మిత మత వాదానికి, మత సహన అభ్యుదయ వాదానికి మధ్య మరో భారీ బ్యాలట్ పోరుకు రంగం సిద్ధమవుతున్నది. పాలక, ప్రతిపక్షాలు చెరో వైపు ఉండి ఈ తాడు ఆటను రక్తికట్టిస్తున్నాయి. ప్రజలు ఎవరి వెంట ఎంత మంది మోహరించి ఈ తాడును లాగుతారో, ఎవరు గెలిచి, ఎవరు ఓడుతారో కొద్ది మాసాల దూరంలో గల లోక్‌సభ ఎన్నికలు రుజువు చేస్తాయి. ప్రస్తుతం రెండు సన్నివేశాలు ఈ రెండు శిబిరాల ఆరాటాన్ని చాటుతున్నాయి. ఇందులో ఒకటి ఈ నెల 22న అయోధ్యలో జరగనున్న రామాలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్కృష్ట ఘట్టం కాగా, రెండవది కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ మొన్న సోమవారం నాడు సంక్షుభిత మణిపూర్ నుంచి ముంబై వరకు ఉద్దేశించి ప్రారంభించిన భారత్ జోడో న్యాయ్ యాత్ర. ఏడాది క్రితం రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. మొదటి యాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చిందని అనుకొన్నారు.

కాని మొన్నటి అయిదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల్లో మూడు కీలక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి రాహుల్ యాత్ర గాలిని తీసి వేసింది. అయినా కుంగిపోయి కాడి వదిలేయకుండా రెండో యాత్రను దీక్షతో కొనసాగించడంలో ఆయన పట్టుదల కనిపిస్తున్నది. ఈ యాత్ర రెండో రోజు మంగళవారం నాడు నాగాలాండ్‌లో మాట్లాడుతూ అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠపై రాహుల్ వ్యాఖ్యానించారు. అది పూర్తిగా నరేంద్ర మోడీకి చెందిన రాజకీయ ఉత్సవమన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిల ఉత్సవమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చుట్టూ అల్లిన ఈ ఘట్టంలో పాలు పంచుకోడం తమకు సాధ్యం కాదని కూడా స్పష్టం చేశారు. రామాలయ ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలను ఆహ్వానించగా వారు అందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్ సభలో పార్టీ నాయకుడు అధిర్ రంజన్ ఈ ఉత్సవాలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.

ఈ ఉత్సవాలను ఎందుకు తాము బహిష్కరిస్తున్నారో రాహుల్ గాంధీ వివరించారు. తాము అన్ని మతాలను గౌరవిస్తామని రాహుల్ స్పష్టం చేశారు. అయోధ్యలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహిస్తున్న ప్రాణ ప్రతిష్ఠ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అందులో గెలుపును ఆశించిన రాజకీయ సన్నివేశమని అన్నారు. ఈ వైఖరిని ఆక్షేపించవలసిన పని లేదు. బాబ్రీ మసీదు విధ్వంసం నాటి నుంచి అదే స్థలంలో ఇప్పుడు అట్టహాసంగా జరుపుకొంటున్న ప్రాణప్రతిష్ఠ ఘట్టం వరకు సాగిన వివాదాస్పద చరిత్ర అందరికీ తెలిసిందే. ఈ అంశాన్ని కేంద్రంగా చేసుకొని బిజెపి పొందిన రాజకీయ ఫలాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. అందుచేత సరైన అవగాహన గల వారెవరైనా అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ ఘట్టాన్ని రాజకీయాలకు అతీతమైనదిగా ఎంతమాత్రం పరిగణించలేరు. అయితే రాహుల్ గాంధీ విమర్శకు బిజెపి ఇచ్చిన సమాధానం కూడా ప్రస్తావించుకోదగినది.

రామాలయ ఘట్టంపై రాహుల్ గాంధీ విమర్శ రాజకీయ పూరితమైనదని, ఆయనకు ఎటువంటి సమాధానం ఇవ్వాలనే దాన్ని తాము ప్రజలకే వదిలిపెడుతున్నామని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మంగళవారం నాడు ప్రకటించారు. రాహుల్ గాంధీ రాజకీయాలను దేశ ప్రజలు అర్ధం చేసుకోగలరని అన్నారు. రాముడి పట్ల దేశ ప్రజలకున్న భయభక్తులపైన, ఆరాధన భావం పట్ల బిజెపికి వున్న నమ్మకం ఎంత గట్టిదో దీనిని బట్టి ఆర్ధం అవుతున్నది. అయోధ్య బాబ్రీ మసీదు స్థలంలో రామాలయాన్ని కట్టి తీరుతామని ప్రజలకు వాగ్దానం చేసి తాము అధికారంలోకి వచ్చామని, దానిని చేసి చూపించామని చెప్పి వారి నుంచి తిరిగి అధికారాన్ని పొందవచ్చని బిజెపి ఆశిస్తున్నది. ఈ సారి లోక్‌సభలో తమ బలం 400కి చేరడం ఖాయమని వారు చెబుతున్నారు. కాని దేశ ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాది జనం ప్రాణప్రదంగా భావించి ఆరాధించే మర్యాద రాముడికి ఇప్పటి అయోధ్య రాముడికి తేడా ఉంది.

అందుకే ఈ ఉత్సవం రాజకీయమైనది అని అనడాన్ని కొట్టిపారేయలేము. పరమత ద్వేషం పునాదుల మీద బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు నిర్మించిన ఆలయ ఉద్యమానికి ఊపిరి కఠిన హిందుత్వమనేది వాస్తవమే. అయితే ఉత్తరాది ప్రజలు కూడా దీనితో మమేకమవుతున్నారనేది కూడా నిజమే. పటిష్టమైన ప్రజాస్వామిక సెక్యులర్ మహోద్యమం ద్వారానే వారిని బిజెపి హిందుత్వ వ్యూహం నుంచి వేరుచేయగలం. బిజెపిని ఈసారి ఓడించి తీరాలని సంకల్పం వహించిన ‘ఇండియా’ కూటమిలోని పార్టీలన్నీ ఒక్క పిడికిలిగా మారి ఈ సందేశాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లాలి. లోక్‌సభలో అత్యధిక స్థానాలు (80) కలిగిన ఉత్తరప్రదేశ్‌లో సామాజిక న్యాయశక్తులను కలుపుకొని ఉమ్మడి ప్రతి పక్ష ఓటును నిర్మించవలసి ఉంది. కొన్ని చిన్న చిన్న పార్టీలు పోటీ చేయడం వల్ల కూడా అక్కడ ప్రతిపక్ష వ్యతిరేక ఓటు చీలిపోయి బిజెపికి మేలు చేస్తున్నది. అటువంటి రంధ్రాలను పూడ్చుకోగలగాలి. రాహుల్ గాంధీ తాజా యాత్ర యుపిలో కుప్పకూలిపోయి ఉన్న కాంగ్రెస్ ఏనుగును ఏమేరకు తిరిగి లేపగలుగుతుందో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News