Wednesday, January 22, 2025

‘ఇండియా’ కూటమి వస్తే ఎంఎస్‌పికి చట్టబద్థత

- Advertisement -
- Advertisement -

ససారం (బీహార్) : దేశంలో దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న రైతుల కోర్కెలను తమ పార్టీ ఆమోదిస్తుందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వచ్చిన పక్షంలో పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి చట్టబద్ధమైన గ్యారంటీ లభించేలా చూస్తామని రాహుల్ వాగ్దానం చేశారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో భాగంగా బీహార్ రోహ్‌తాస్‌లో రైతుల సభ ‘కిసాన్ న్యాయ్ పంచాయత్’ను ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తూ, ‘కర్షకులకు వారి పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు’ అని ఆరోపించారు. ‘సార్వత్రిక ఎన్నికల అనంతరం ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే ఎంఎస్‌పికి చట్టబద్ధమైన గ్యారంటీ ఇస్తాం. రైతులు కాంగ్రెస్ నుంచి ఎప్పుడు ఏది కోరినా దానిని వారికి ఇవ్వడమైంది.

రుణ మాఫీ గానీ, ఎంఎస్‌పి గానీ మేము సదా కర్షకుల ప్రయోజనాలను పరిరక్షించాం. మున్ముందు కూడా అదే చేస్తాం’ అని రాహుల్ చెప్పారు. పంటలకు చట్టబద్ధమైన గ్యారంటీతో సహా కర్షకుల డిమాండ్లను ఆమోదించేలా బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి రైతుల సంఘం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) శుక్రవారం ‘భారత్ బంద్’కు పిలుపు ఇచ్చిన తరుణంలో రాహుల్ ఈ ప్రకటన చేశారు. పంజాబ్ నుంచి రైతులు తమ ‘ఢిల్లీ చలో’ పాదయాత్రను మంగళవారం ప్రారంభించారు. కాని వారిని ఢిల్లీ, హర్యానా మధ్య శంభు, ఖనౌరి సరిహద్దు ప్రాంతాలలో భద్రత సిబ్బంది నిలువరించారు. నిరసనకారులైన రైతులు అప్పటి నుంచి ఆ సరిహద్దు ప్రాంతాల వద్దే మకాం వేశారు. వారి ఆందోళన శుక్రవారం నాలుగవ రోజులోకి ప్రవేశించింది. కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దుయ్యబట్టారు.

‘రక్షణ బడ్జెట్ నిధులలో గణనీయమైన భాగాన్ని ఒక పారిశ్రామికవేత్త జేబుల్లోకి మళ్లించింది’ అని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘కేంద్ర రక్షణ బడ్జెట్ జవాన్ల సంక్షేమానికి కాదు. రక్షణ కాంట్రాక్టులు అన్నీ ఒక కార్పొరేట్ గ్రూప్‌కే వెళుతున్నాయి’ అని ఆయన ఆరోపించారు. ‘అగ్నివీర్’ పథకంపై కూడా కేంద్రాన్ని రాహుల్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ‘సైన్యాన్ని రెండు కేటగరీలు & అగ్నివీర్, రెగ్యులర్‌లుగా విభజించింది’ అని ఆయన విమర్శించారు. ‘ఎవరైనా అగ్నివీర్ గాయపడినా లేక అమరుడైనా వారికి తగిన నష్టపరిహారం లభించదు. ఎందుకు ఈ వివక్ష? అగ్నివీర్, ఇతరుల కోసం సైన్యంలో వేర్వేరు కేటగరీలను ఎందుకు సృష్టించారు?’ అని రాహుల్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News