Monday, December 23, 2024

భారత్ న్యాయ్ యాత్ర

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికలకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి సన్నాహాలలో మునిగి వుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడి పాత్రను గాంధీల కుటుంబేతరుడు దళిత నేత మల్లికార్జున ఖర్గేకి అప్పగించినా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ముందుంచి వ్యవహారాలను నడిపిస్తున్నది. దేశ వ్యాప్తంగా ప్రజలతో సంబంధాలను పెనవేసుకోడానికి రాహుల్ గాంధీ గతంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం అయిందనే అభిప్రాయం కలిగించింది. లోక్‌సభ ఎన్నికల ఘట్టం ప్రారంభం కావడానికి ముందే రెండో యాత్రకు బయలుదేరి మిగిలిన ప్రాంతాలను చుట్టి రావాలని ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకొన్నారు. జనవరి 14న మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి ప్రారంభించి మార్చి 20న ముంబయిలో ముగింపుకి చేరనున్న ఈ యాత్రకు భారత్ న్యాయ్ యాత్ర అని పేరు పెట్టారు. భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల్లో ఐక్యత, ప్రేమ, సామరస్యాలను పెంపొందించే కృషి జరిగిందని, సామాజిక, ఆర్ధిక, రాజకీయ, న్యాయ సందేశాన్ని ఇస్తూ ఇప్పటి యాత్ర సాగుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలకు హిందూ ఓటును మళ్ళీ దండిగా ఆకర్షించడం కోసం బిజెపి జనవరి 22న అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవాన్ని బ్రహ్మాండంగా నిర్వహించనున్నది.

అందుకు ప్రతిగా సామాజికన్యాయ సాధన, కులగణన సందేశాలను వ్యాప్తి చేయాలని రాహుల్ సంకల్పించారు. బీహార్, ఉత్తరప్రదేశ్ కేంద్రంగా, బిజెపి మత తత్వానికి వ్యతిరేకంగా మండల్ శక్తుల సమీకరణ ఏనాడో జరిగింది. అప్పటి ప్రధాని విపి సింగ్ చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వ విద్య, ఉద్యోగాలలో బిసిలకు 27% రిజర్వేషన్ లు సిఫారసు చేసిన బిపి మండల్ నివేదిక దుమ్ముదులిపి అమల్లో పెట్టారు. దానితో శివమెత్తిన సంఘ్‌పరివార్ శక్తులు హిందుత్వ అజండాను ముందుకు తేవడం, బాబ్రీ మసీదు కూల్చివేత ద్వారా హిందూ ఓటు బ్యాంకును విశేషంగా పెంచుకొని దేశాధికారాన్ని చేజిక్కించుకోడం తెలిసిందే. దానికి వ్యతిరేంగా సోషలిస్టు ఉద్దండులు లాలూ, ములాయం సింగ్ యాదవ్‌ల నాయకత్వంలో సామాజిక న్యాయశక్తులు సంఘటితమయ్యాయి. బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో అధికారం కైవసం చేసుకోగలిగాయి. ఇంకొక వైపు కాన్షీరాం ఉద్యమం యుపిలో బహుజన సమాజ్ పార్టీని ఉచ్ఛస్థితికి తీసుకుపోయింది. అప్పటి వరకు కాంగ్రెస్‌ను అంటిపెట్టుకొని వున్న దళిత, మైనారిటీ ఓట్లు దానిని వీడిపోడంతో అది బలహీనపడిపోయింది. దాని అగ్ర వర్ణ ఓటును బిజెపి కైవసం చేసుకొన్నది. దేశమంతటా ఉనికి వున్న కాంగ్రెస్ పార్టీ పదేళ్లుగా దేశాధికారానికి దూరమైపోయింది. అంతేకాదు, పార్లమెంటులో దాని బలం దారుణంగా పడిపోయి బక్కచిక్కిపోయింది.

అదే సమయంలో జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ప్రతిపక్ష శక్తిలేని పరిస్థితి కొనసాగుతున్నది. కాంగ్రెస్ కోల్పోయిన చోట్ల ఆ ఖాళీల్లో బలమైన ప్రాంతీయ పార్టీలు దూసుకువచ్చాయి. లోక్‌సభలో స్పష్టమైన మెజారిటీతో బిజెపి వరుసగా రెండోసారి దేశాధికారాన్ని అనుభవిస్తున్నది. దేశం ఏరికోరి నెలకొల్పుకొన్న సెక్యులర్ రాజ్యాంగ ఆదర్శాలకు పని కట్టుకొని విఘాతం కలిగిస్తూ, ప్రజల సంపదను ఆశ్రిత కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్న బిజెపి పాలకుల విధానాలు దేశంపై నిరంకుశ ధోరణులను రుద్దుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ ఎన్నికలకు ప్రతిపక్షాలన్నీ ఒక్కత్రాటి మీదకు రావడం అనివార్యమైంది. ఇండియా (భారతీయ జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి) అవతరించింది. దీనికి కూడా కాంగ్రెస్ పార్టీయే ఇరుసుగా ఉన్నది. ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా బిజెపిని ఓడించాలన్న లక్ష్యంతో ఈ కూటమి అడుగులు వేస్తున్నది. కూటమి భాగస్వామ్య పక్షంగాను, విడిగాను ఎన్నికల్లో సత్తా చాటాలనే ఆరాటం కాంగ్రెస్‌లో కనిపిస్తున్నది. అందుకోసం అది ఇప్పుడు కొత్తగా సామాజిక న్యాయ పతాకాన్ని చేపట్టింది. కులగణనను డిమాండ్ చేస్తున్నది. ఈ పనిని బీహార్‌లో నితీశ్ కుమార్ కుమార్ ప్రభుత్వం అనుకొన్న వెంటనే జరిపించి వేసింది. కర్నాటకలో అనూహ్య విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మాత్రం అక్కడ ఇంతవరకు దీనిని చేపట్టలేకపోయింది.

రాహుల్ గాంధీ కాంగ్రెస్‌కు సామాజిక న్యాయ చుక్కానిని తొడగాలని సంకల్పించినప్పటికీ రాష్ట్రాల్లోని ఆ పార్టీ అగ్రవర్ణ నాయకత్వం చిత్తశుద్ధితో అందుకు సహకరించే స్థితిలేదనే అభిప్రాయం వుంది. అలాగే బిజెపి అంతగా కాకున్నా దాని మాదిరి హిందుత్వ పోకడలు కాంగ్రెస్‌లోనూ వున్నాయి. కాకపోతే దీనిది కాలుదువ్వే హిందుత్వ కాదు. అందుచేత కాంగ్రెస్ పార్టీని ప్రజలు బిజెపికి గట్టి ప్రత్యామ్నాయంగా చూడలేకపోతున్నారు.ఈ లోపాలను తొలగించడంలో రాహుల్ గాంధీ గాని, ఆ పార్టీ నాయకత్వం గాని ఎంతవరకు సఫలం కాగలుగుతారన్నదే దాని భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. అయితే బిజెపి పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి చోటు చేసుకొంటే అది అనివార్యంగా రేపటి ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి విజయానికి దోహదం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సొంతంగానూ మేలు కలుగుతుంది. రాహుల్ గాంధీ తనదైన విలక్షణ పద్ధతిలో ప్రజలతో మమేకమవుతూ సాగించే భారత్ న్యాయ్ యాత్ర ఈ రెండు విధాల ఏ మేరకు ఫలిస్తుందో వేచిచూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News