Sunday, December 22, 2024

నాపై దాడికి వ్యూహ రచన: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో తన ‘చక్రవ్యూహం’ ప్రసంగం తరువాత తనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దాడికి వ్యూహరచన జరుగుతోందని లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఆరోపించారు. కేరళ వాయనాడ్‌లో కొండచరియల విలయం నేపథ్యంలో అక్కడి ఎంపిగా తన జవాబుదారతనం గురించి జనం అడగకుండా దారి మళ్లించేందుకు రాహుల్ కొత్త కథనం సృష్టిస్తున్నారని బిజెపి విమర్శించింది. ‘టూ ఇన్ వన్‌కు నా చక్రవ్యూహం ప్రసంగం నచ్చినట్లు లేదు. నాపై దాడికి వ్యూహ రచన జరుగుతోందని ఇది ఆంతరంగికులు నాకు చెప్పారు’ అని రాహుల్ గాంధీ శుక్రవారం తెల్లవారు జామున ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘ఇడి డైరెక్టర్‌ను రెండు చేతులతోను స్వాగతించేందుకు నిరీక్షిస్తున్నా’ అని ఆయన తెలిపారు.

మరొక పరిణామంలో రాజకీయ వేధింపు నిమిత్తం ఇడి, సిబిఐ, ఆదాయపు పన్ను (ఐటి) శాఖ వంటి సంస్థలను బిజెపి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుండడం’పై వాయిదా తీర్మానానికి కాంగ్రెస్ ఎంపి మాణిక్కం ఠాగూర్ నోటీస్ అందజేశారు. ‘రాజకీయ వేధింపు కోసం ఇడి, సిబిఐ, ఐటి వంటి సంస్థలను బిజెపి ప్రభుత్వం దుర్వినియోగం చేయడాన్ని ప్రతిపక్షం గర్హిస్తున్నది. తమ బలం 303 నుంచి 240కి తగ్గిపోయినప్పటికీ, టిడిపి, జెడియుతో పొత్తుపై ఆధారపడుతున్నప్పటికీ, ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను బెదిరించడానికి, ప్రజాస్వామ్య సిద్ధాంతాలను కించపరచడానికి, తమకు వత్తాసు పలికేలా ఒత్తిడి చేయడానికి ఆ సంస్థలను నియోగిస్తూనే ఉన్నది.

ప్రభుత్వ అధికారాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయడం సమ్మతనీయం కాదు. మన వ్యవస్థల సమగ్రతకు ముప్పు కలిగిస్తోంది’ అని ఆ నోటీస్ వివరించింది. రాహుల్ గాంధీ ఆరోపణకు బిజెపి నేత, మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ, తన జవాబుదారీతనం గురించి జనం ప్రశ్నలు అడుగుతున్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షునికి చెప్పి ఉండవచ్చునని, అందుకే ఆయన కొత్త కథనం సృష్టిస్తున్నారని విమర్శించారు. అయితే, పలువురు కాంగ్రెస్, ప్రతిపక్ష నాయకులు రాహుల్‌కు వత్తాసుగా నిలిచారు. దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం ‘దుర్వినియోగం చేస్తున్నది’ అని వారు ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News