Saturday, March 29, 2025

లోక్‌సభలో నన్ను మాట్లాడనివ్వలేదు.. స్పీకర్ పారిపోయారు:రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

లోక్‌సభలో తనను మాట్లాడనివ్వలేదని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు. నిరుద్యోగిత అంశం ప్రస్తావనకు తాను ప్రయత్నించినప్పుడు స్పీకర్ ‘పారిపోయారు అంతే’ అని రాహుల్ అన్నారు. సభ్యులు సభ గౌరవాన్ని పరిరక్షించవలసి ఉంటుందన్న సభా కార్యక్రమాల నిబంధనలను పాటించాలని రాహుల్‌ను లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా కోరిన తరువాత ఆయన ఆ వ్యాఖ్యలుచేశారు. స్పీకర్ ఆ అభిప్రాయం ఎందుకు వ్యక్తం చేసిందీ వెంటనే స్పష్టంగా తెలియరాలేదు. స్పీకర్ తన గురించి వ్యాఖ్యలు చేశారని, తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆయన సభను వాయిదా వేశారని రాహుల్ చెప్పారు. క్రితం వారం తనను మాట్లాడనివ్వలేదని ఆయన ఆరోపించారు. తీవ్ర సమస్యల ప్రస్తావనకు తాను ప్రయత్నించినప్పుడు తన మైక్రోఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని కాంగ్రెస్ ఎంపి పలు సందర్భాల్లో ఆరోపించారు. ‘ప్రతిపక్ష నాయకుని మాట్లాడనివ్వాలన్న సంప్రదాయం ఉన్నది.

నన్ను మాట్లాడనివ్వవలసిందిగా నేను విజ్ఙప్తి చేశాను కానీ ఆయన (స్పీకర్ ) పారిపోయారు అంతే. ఇది సభను నడిపే పద్ధతి కాదు. నా గురించి అవాస్తవమైనది ఏదో ఆయన అన్నారు& ఆయన సభను వాయిదా వేశారు’ అని రాహుల్ పార్లమెంట్ సముదాయంలో విలేకరులతో చెప్పారు. స్పీకర్ ఓమ్ బిర్లా సభా కార్యకలాపాలను ‘అప్రజాస్వామిక రీతిలో నిర్వహిస్తున్నారని రాయబరేలి ఎంపి రాహుల్ ఆరోపించారు. కీలక సమస్యల ప్రస్తావనకు తాను పదే పదే చేసిన విజ్ఞప్తులను బేఖాతరు చేశారని ఆయన చెప్పారు. ‘గడచిన ఏడెనిమిది రోజుల్లో నన్ను మాట్లాడనివ్వలేదు. ప్రతిపక్షానికి చోటే లేదు& ప్రభుత్వానికి మాత్రమే తావు ఉన్నది. ప్రధాని కుంభమేళా గురించి మాట్లాడారు. నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడాలని నేను కూడా వాంఛించాను, కానీ నన్ను అనుమతించలేదు’ అని రాహుల్ తెలిపారు. ఈ సంఘటన తరువాత గౌరవ్ గొగోయ్, కెసి వేణుగోపాల్, లోక్‌సభలో పార్టీ విప్ మాణిక్కం టాగూర్ సహా 70 మంది కాంగ్రెస్ ఎంపిలు లోక్‌సభ స్పీకర్‌ను కలుసుకుని, సభలో రాహుల్‌ను మాట్లాడనివ్వకపోవడంపై తమ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష నాయకుడు సభ నిబంధనలు పాటించాలని ఆశిస్తున్నా: స్పీకర్
సభా గౌరవాన్ని పరిరక్షించేందుకు సభ్యులు పాటిస్తారని ఆశిస్తున్న సభా కార్యక్రమాల నిబంధనలను అనుసరించవలసిందిగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని లోక్‌సభ స్పీకర్ బుధవారం కోరారు. సభ ఉన్నత ప్రమాణాలను, గౌరవాన్ని నిలబెట్టే విధంగా సభ్యులు ప్రవర్తించవలసి ఉంటుందని స్పీకర్ అన్నారు. ‘సభ్యుల వ్యవహరణ ఉన్నత ప్రమాణాలకు తగినట్లుగా లేకపోయిన అనేక సంఘటనలు నా దృష్టికి వచ్చాయి’ అని స్పీకర్ తెలియజేశారు. ఈ సభలో తండ్రి, కుమార్తె, తల్లి, కుమార్తె, భర్త, భార్య సభ్యులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సభలో సభ్యులు పాటించవలసిన నిబంధనలకు సంబంధించిన 349 నిబంధన ప్రకారం ప్రతిపక్ష నాయకుడు వ్యవహరిస్తారని నేను ఆశిస్తున్నా’ అని స్పీకర్ తెలిపారు. ‘ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఆశిస్తున్నా’ అని స్పీకర్ ఓమ్ బిర్లా చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News