‘వక్ఫ్ బిల్లు ముస్లింలపై దాడి చేస్తుంది’ అని, ‘మున్ముందు ఇతర మతాలను లక్షం చేసుకోవడానికి ఆనవాయితీ అవుతుంది’ అని లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ శనివారం ఆరోపించారు. వక్ఫ్ బిల్లు ఆమోదం తరువాత కాథలిక్ చర్చి భూమిపైకి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఇప్పుడు దృష్టి మరల్చిందని పేర్కొంటున్న ఒక వ్యాసాన్ని రాహుల్ గాంధీ ‘ఎక్స్’ పోస్ట్‌లో పంచుకున్నారు. ‘వక్ఫ్ బిల్లు ఇప్పుడు ముస్లింలపై దాడి చేస్తుందని నేను చెప్పాను, కానీ అది భవిష్యత్తులో ఇతర మతాలను లక్షం చేసుకోవడానికి ఒక ఆనవాయితీని నెలకొల్పుతుంది’ అని రాహుల్ ‘ఎక్స్’లో రాశారు.
‘ఆర్‌ఎస్‌ఎస్ తన దృష్టిని క్రైస్తవులపైకి మళ్లించేందుకు ఎక్కువ కాలం పట్టలేదు’ అని ఆయన ఆ వ్యాసాన్ని ప్రస్తావిస్తూ తన పోస్ట్‌లో రాశారు. ‘అటువంటి దాడుల నుంచి మన ప్రజలను రక్షించే ఏకైక కవచం రాజ్యాంగం. దానిని సమర్థించడం మన ఉమ్మడి కర్తవ్యం’ అని రాహుల్ పేర్కొన్నారు. భూములపై ఆధిపత్యంలో వక్ఫ్ బోర్డును కాథలిక్ చర్చి దాటిందని పేర్కొంటున్న మరొక వ్యాసాన్ని కాంగ్రెస్ నేత కెసి వేణుగోపాల్ కూడా పంచుకున్నారు. ‘జోస్యం చెప్పిన ప్రకారం మొదట ఒక మతాన్ని లక్షం చేసుకున్నారు, ఇప్పుడు మరొక మతంపైకి దృష్టి మళ్లింది’ అని వేణుగోపాల్ ఆరోపించారు.