Wednesday, January 22, 2025

బ్రిటన్ వ్యాఖ్యలపై పార్లమెంటరీ ప్యానెల్‌కు రాహుల్ వివరణ ?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత ప్రజాస్వామ్యంపై లండన్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఇంకా దుమారం కొనసాగుతూనే ఉంది. ఆయన క్షమాపణలు చెప్పేవరకు ఊరుకునేది లేదని అధికార బీజేపీ తేల్చి చెప్పింది. దీనిపై అధికార , విపక్షాల మధ్య వాగ్వాదం కొనసాగుతూనే ఉంది. పార్లమెంట్ సమావేశాలు సైతం ఎలాంటి చర్చ, కార్యకలాపాలు లేకుండానే వాయిదా పడుతున్నాయి.

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలపై శనివారం స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. విదేశాంగ మంత్రి జయశంకర్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ ప్యానెల్ సమావేశంలో ఆయన సుదీర్ఘంగా మాట్లాడినట్టు జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవాలని తాను ఏ దేశాన్ని ఆహ్వానించలేదని రాహుల్ సమావేశంలో చెప్పినట్టు తెలుస్తోంది. ఇది భారత అంతర్గత విషయమని, దీన్ని అధికారంలో ఉన్న పార్టీయే పరిష్కరించాల్సిన అవసరం ఉందని తాను స్పష్టంగా చెప్పానని రాహుల్ సమావేశంలో వివరించినట్టు సమాచారం.

తొలుత జీ20 అధ్యక్షతపై జయశంకర్ తన ప్రణాళికలను కమిటీకి వివరించారు. అది పూర్తయిన తరువాత ఓ ఎంపీ మాట్లాడుతూ కొంతమంది మనదేశ ప్రజాస్వామ్యాన్ని విదేశీ గడ్డపై అవమానిస్తున్నారని అన్నట్టు తెలుస్తోంది. దీనికి స్పందిస్తూ రాహుల్ సుదీర్ఘంగా తన వాదనను కమిటీ ముందు ఉంచినట్టు సమాచారం. ఈ క్రమంలో అధికార, విపక్ష ఎంపీల మధ్య సమావేశంలో వాగ్వాదం జరిగినట్టు సమాచారం. రాహుల్ వివరణ ఇవ్వడానికి ఇది సరైన వేదిక కాదని కొంతమంతి బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

అయితే అధికార పార్టీ ఎంపీలే ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు దానిపై క్లారిటీ ఇచ్చేహక్కు ప్యానెల్ సభ్యుడికి ఉంటుందంటూ విపక్ష ఎంపీలు రాహుల్‌కు మద్దతుగా నిలిచినట్టు సమాచారం. ఈ క్రమంలో సభ్యులను నిలువరించిన జయశంకర్ కేవలం సమావేశ అజెండా పైనే మాట్లాడాలని కోరారట. ఈ విషయంపై ఏదైనా స్పష్టత ఇవ్వాలంటే పార్లమెంటు లోనే మాట్లాడాలని సూచించారని తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News