Wednesday, January 22, 2025

యాత్ర లక్ష్యం ప్రజలందరికీ న్యాయం చేకూర్చడమే

- Advertisement -
- Advertisement -

చిన్న రాష్ట్రమైనా నాగాలాండ్ ప్రజలు ఇతరులతో సమానులే
భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ స్పష్టీకరణ

కోహిమా : నాగాలాండ్ ప్రజలు ‘చిన్న రాష్ట్రం’ నుంచి వచ్చినా దేశంలోని ఇతరులతో సమానమే అనే భావనలో ఉండాలని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మంగళవారం స్పష్టం చేశారు. తన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో భాగంగా నాగాలాండ్ రాజధాని కోహిమా నడిబొడ్డున ఒక ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ, యాత్ర లక్షం ‘ప్రజలకు న్యాయం చేకూర్చడం’ అని, ‘రాజకీయాలు, సమాజం, ఆర్థిక వ్యవస్థలను అందరికీ సమానం చేయడం, ప్రతిఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడం’ అని చెప్పారు.

రాహుల్ గాంధీ కోహిమా వార్ సెమెటరీని సందర్శించి, రెండవ ప్రపంచ యుద్ధంలో విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. ‘మీది చిన్న రాష్ట్రమైనా పట్టించుకోవలసిన అగత్యం లేదు. దేశంలోని ఇతర ప్రజలతో మీరు సమానులేనని భావించాలి. అది ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ధ్యేయం’ అని ఆయన చెప్పారు. ‘ప్రజలక న్యాయం చేకూర్చడం, రాజకీయాలు, సమాజం, ఆర్థిక వ్యవస్థలను మరింత సమానంగా తీర్చిదిద్దడం, ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడం ప్రధాన ఉద్దేశం’ అని రాహుల్ వివరించారు. ఆదివారం (14న) మణిపూర్‌లో ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు ఉపక్రమించిన రాహుల్ సోమవారం సాయంత్రం నాగాలాండ్ చేరుకున్నారు.

హైస్కూల్ జంక్షన్‌లో మరొక ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ, ‘విభిన్న సంస్కృతులు, మతాలు, భాషలను సంఘటితపరచడం’ ధ్యేయంగా కాంగ్రెస్ ఇంతకు ముందు దక్షిణ భారత్ నుంచి కాశ్మీర్ వరకు ‘భారత్ జోడో యాత్ర’ నిర్వహించిందని తెలియజేశారు. ఈ పర్యాయం ఈశాన్యం నుంచి మరొక యాత్ర చేపట్టాలని పార్టీ నిశ్చయించిందని, ఎందుకంటే ఈ ప్రాంతం ‘భారత్ యోచనకు ఎంతో కీలకమైనది’ అని ఆయన పేర్కొన్నారు. యాత్ర రాష్ట్ర రాజధాని మీదుగా సాగగా మహిళలు, పిల్లలతో సహా వందలాది మంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ 100 లోక్‌సభ నియోజకవర్గాలు, 6713 కిలో మీటర్ల మేర సాగి ముంబయిలో ముగియవలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News