Saturday, December 21, 2024

వయనాడ్‌ నుంచే రాహుల్ పోటీ

- Advertisement -
- Advertisement -

రానున్న లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయింది. 39 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ శుక్రవారం విడుదల చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి సిటింగ్ స్థానం కేరళలోని వయనాడ్‌నుంచి పోటీ చేస్తారు. అయితే రాహుల్ గాంధీ యుపిలోని అమేథీనుంచి కూడా పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి కానీ దానిపై ఇంకా స్పష్టత రాలేదు. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలుండగా, ప్రస్తుతం నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ తొలి జాబితాలో కేరళలోని 16 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ మరోసారి తిరువనంతపురం స్థానంనుంచి పోటీ చేస్తారు. అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ అలప్పూజనుంచి బరిలోకి దిగనున్నారు. అలాగే చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్ రాజ్‌నందన్‌గావ్‌నుంచి తొలిసారి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవనున్నారు.

కాంగ్రెస్ తొలి జాబితాలో ఉన్న ప్రముఖుల్లో కర్నాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్ సోదరుడు డికె సురేశ్ కూడా ఉన్నారు. బెంగళూరు రూరల్ నియోజకవర్గంనుంచి ఆయన పోటీ చేస్తారు.చత్తీస్‌గఢ్‌లోని కోర్బానుంచి జ్యోత్సా మహంతి , మహాసముంద్‌నుంచి తామరధ్వజ్ సాహులకు అవకాశం కల్పించారు. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం సమావేశమై 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 60కి పైగా స్థానాలపై చర్చించిన అనంతరం తొలిజాబితాను ప్రకటించారు. ఢిల్లీ, కర్నాటక, కేరళ, చత్తీస్‌గఢ్, తెలంగాణ, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, లక్షద్వీప్‌లోని లోక్‌సభ స్థానాలపై సిఇసి చర్చించింది. కాగా తొలి జాబితాలోని 39 మంది అభ్యర్థుల్లో 15 మంది జనరల్, మిగతా 24 మంది ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, మైనారిటీ కేటగిరీలకు చెందిన వారున్నారని వేణుగోపాల్ తెలిపారు. తొలి జాబితాలో 12 మంది అభ్యర్థులు 50 ఏళ్ల లోపు వారేనని వేణుగోపాల్ చెప్పారు.

అభ్యర్థుల్లో 12 మంది 50 ఏళ్ల లోపు వారేనని పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ చెప్పారు.ఈ రోజు ప్రకటించిన తొలి జాబితా ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన స్థానాలుండగా, చత్తీస్‌గఢ్, కేంద్రపాలితప్రాంతమైన లక్షద్వీప్‌నుంచి కొన్ని స్థానాలు కూడా ఉన్నాయి.అత్యధికంగా కేరళలో 16 స్థానాలు, కర్నాటకలో ఏడు, చత్తీస్‌గఢ్‌లో6 స్థానాలు ఉండగా, మిగిలిన స్థానాలు మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, లక్షద్వీప్‌కు చెందినవి ఉన్నాయి. 20 స్థానాలున్న కేరళలో 16 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్, మిగతా నాలుగు స్థానాలను మిత్రపక్షాలకు వదిలిపెట్టనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News