Monday, January 20, 2025

ఆత్మరక్షణలో పడిన కాంగ్రెస్!

- Advertisement -
- Advertisement -

వయస్సు, అనారోగ్యం రీత్యా ప్రత్యక్ష ఎన్నికలకు దూరం గా ఉండాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రెండు నెలల క్రితం రాజస్థాన్ నుండి రాజ్యసభకు ఎన్నిక కావడం ద్వారా రాయ్‌బరేలీ నుండి పోటీ చేయబోవడం లేదనే సంకేతం ఇచ్చారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత అమేథీ వైపు చూడని రాహుల్ గాంధీ అప్పుడు గెలుపొందిన కేరళలోని వాయనాడ్ పైననే దృష్టి కేంద్రీకరిస్తూ ఉండడంతో గాంధీ కుటుంబానికి దశాబ్దాలుగా కంచుకోటలుగా పేరొందిన ఈ రెండు నియోజకవర్గాలను వదిలి వేస్తున్నారా? అనే అభిప్రాయం కలిగింది.

మధ్యలో ప్రియాంక గాంధీ తల్లి నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని సంకేతాలు వెలువడినా స్పష్టత లేకుండా పోయింది.చివరి వరకు ఈ విషయం తేల్చకుండా గతంలో మూడు సార్లు గెల్చిన అమేథీ నుండి కాకుండా రాయ్‌బరేలీ నుండి పోటీ చేయాలనీ చివరి క్షణంలో నిర్ణయించుకొని నామినేషన్ వేయడం ఒక విధంగా సొంత పార్టీలోనే గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు అమేథీ నుండి పోటీ చేసేందుకు భయపడ్డారా? అనే ప్రశ్న తలెత్తుతుంది.

2014లో ఓటమి చెందినా నియోజకవర్గాన్ని వదలకుండా అంటిపెట్టుకొని ఉండటం ద్వారా కొంత సానుభూతి పొందడంతో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ 2019లో రాహుల్ గాంధీపై గెలుపొందగలిగారు. అదే విధంగా రాహుల్ సైతం ఓటమి అనంతరం నియోజకవర్గాన్ని వదలకుండా ఉంటె ఇప్పుడు పరిస్థితి మరో విధంగా ఉండెడిది. దేశంలోనే అత్యధికంగా 80 లోక్‌సభ సీట్లు గల ఉత్తర ప్రదేశ్‌లో రాజకీయంగా పట్టు ఏర్పర్చుకోకుండా జాతీయ రాజకీయాలను శాసింపలేమని భావించే ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి నుండి లోక్‌సభకు ఎన్నికవుతున్నారు. అదే విధంగా జాతీయ స్థాయిలో బిజెపిని ఎదిరించగలిగే సామర్ధ్యం గల ఏకైక పార్టీగా పేరొందిన కాంగ్రెస్ ఉత్తర ప్రదేశ్‌ను వదిలి వేయడంతోనే ఇప్పుడు రాజకీయంగా ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అందుకనే కాంగ్రెస్‌కు చెందిన పలువురు సీనియర్ నాయకులు ఉత్తరప్రదేశ్‌లో పోటీ చేయకుండా వదిలివేయవద్దని చెప్పడంతోనే రాహు ల్ చివరకు పోటీకి ఒప్పుకున్నట్లు తెలుస్తున్నది.

అయితే, అమేథీలోనే పోటీ చేసి గెలుపొందాలని మల్లికార్జున్ ఖర్గే వంటి సీనియర్ నేతలు సూచించినా రాహుల్ పెడచెవిన పెట్టారు. పలు అంతర్గత సర్వేలలో స్మృతి ఇరానీ స్థానిక ప్రజలలో కొంత వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. రాహుల్ గెలుపొందే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పినా పోటీకి వెనుకాడడం ఓ విధంగా కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలో పడవేసింది. అందులకే అమేథీలో ఓడిపోయి వయనాడ్ వెళ్లిన రాహుల్ గాంధీ ఇప్పుడు అక్కడ కూడా ఓడిపోతాడనే భయంతోనే రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఎద్దేవా చేయగలిగారు. వాస్తవానికి రాయ్‌బరేలీలో బిజెపికి బలమైన అభ్యర్థి లేరు. ఉమా భారతి నుండి అనేక మంది పేర్లతో సర్వేలు జరిపించినా ఎవ్వరికీ గెలిచే అవకాశాలు లేవని వెల్లడైంది. వరుణ్ గాంధీ అయితే గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వేలు వెల్లడించడంతో ఆయనను పోటీ చేయించాలని జెపి నడ్డా, అమిత్ షా వంటివారు ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

కాంగ్రెస్ పార్టీలోని పెద్దలతో పాటు సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా గాంధీ కుటుంబం నుండి ఎవ్వరో ఒకరు పోటీచేయాలని పట్టుబట్టడంతో పోటీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు రెండు చోట్ల నుండి గెలుపొందితే ఏ సీటుకు రాజీనామా చేస్తారనే ప్రశ్న తలెత్తుతున్నది. ఏదేమైనా తన సీటు విషయంలో రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయడం కాంగ్రెస్ పార్టీలో పలు కీలక అంశాలలో ఆయన అస్థిర ధోరణిని వెల్లడి చేస్తున్నది. లోక్‌సభకు మొదటి రెండు విడతల జరిగిన ఎన్నికల తీరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీలో కొంత అందోళన కలిగిస్తున్నట్లు ఆయన ప్రసంగాల ధోరణి వెల్లడి చేస్తున్నది. 50 సీట్లలోపే గెల్చుకొని, తిరిగి ప్రతిపక్ష హోదా కూడా పొందలేదని అంటూ కాంగ్రెస్ పార్టీ పెద్ద పోటీ కాదన్నట్లు మాట్లాడుతున్న ఆయన నిత్యం ఆ పార్టీపై తన హోదా మరచిపోయి అనుచిత విమర్శలు చేస్తుండటం ఆయనలో పెరుగుతున్న అసహనాన్ని వెల్లడి చేస్తున్నది.

ముఖ్యంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ చెప్పుకోదగిన సీట్లు గెల్చుకోలేకపోయిన రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర, కర్నాటక వంటి రాష్ట్రాల్లో బిజెపి పెద్ద ఎత్తున సీట్లు కోల్పోయే పరిస్థితి కనిపించడం ప్రధానిలో అసహనాన్ని రెట్టింపు చేస్తున్నట్లు అర్ధంఅవుతున్నది. అందుకనే కాంగ్రెస్ గెలుపొందితే ముస్లింలకు హిందువుల ఆస్తులను పంచివేస్తోందని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పాకిస్తాన్‌లో నాయకులు కోరుకొంటున్నారని అంటూ ఓ ప్రధానిగా తన హోదా మరచి విమర్శలు చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నేతృత్వంలోని కూటమిని ప్రజలు మొదటి రెండు విడతల పోలింగ్‌లో తిరస్కరించారని చెబుతున్న ప్రధాని నిత్యం ‘కాంగ్రెస్ గెలిస్తే..’ అంటూ ప్రసంగాలు చేయాల్సిన అవసరం ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో బిజెపి 400 స్థానాలు గెలవాలని ఎందుకు కోరుకొంటున్నదనే ప్రశ్న ఆ పార్టీని ఆత్మరక్షణలో పడవేస్తుంది.పలువురు బిజెపి మంత్రులు, ఎంపిలు తమకు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తామని ప్రకటనలు చేస్తే బిజెపి కేంద్ర నాయకులు ఎవ్వరూ ఖండించలేదు.

కానీ ఇప్పుడు 400 సీట్లు వస్తే రాజ్యాంగం మార్పు పేరుతో ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి రిజర్వేషన్లను రద్దు చేస్తారని ప్రతిపక్షాలు ప్రచారం ప్రారంభిస్తే బిజెపి ఖంగారు పడుతున్నది. స్వయంగా ఆర్‌ఎస్‌ఎస్ అధినేత డా. మోహన్ భగవత్ రంగంలోకి దిగి తామెప్పుడూ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని స్పష్టం చేయాల్సి వచ్చింది. పరోక్షంగా రాజ్యాంగం మార్పు అంశం ప్రతిపక్షాలకు బలమైన ఆయుధం సమకూర్చినట్లు అయింది. వాస్తవాలు ఏవైనా ఎన్నికల సమయంలో విధానాల గురించిన చర్చలు జరగడం లేదు. ఎన్నికల ప్రణాళికలు గాలిలో కలిసిపోతున్నాయి. దేశప్రజలు నేడు ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతాంగ సంక్షోభం, పెరుగుతున్న ఆర్థిక వ్యత్యాసాలు వంటి సమస్యలగురించి కనీసం ప్రస్తావించే సాహసం పదేళ్ళపాటు అధికారం లో ఉన్న ప్రభుత్వం చేయలేకపోతున్నది. పరస్పరం ప్రజలలో ఉద్రిక్తలు రెచ్చగొట్టే ప్రయత్నాల ద్వారా పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మరోవంక, మొదటి రెండు దశలలో ఓటింగ్ శాతం 2019 ఎన్నికల నాటికన్నా దాదాపు 5% తక్కువగా ఉండటం కలవరం కలిగిస్తోంది. ఓటర్లలో, ముఖ్యంగా అధికార పార్టీకి మద్దతుదారులతో నెలకొన్న నిర్లిప్తతే అందుకు కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు. అయి తే, కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నవారు ఎట్లాగూ గెలిచే అవకాశం లేదని పోలింగ్‌కు రావడం లేదని, బిజెపి మద్దతు దారులు మాత్రం పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొంటున్నారని అమిత్ షా చెప్పారు. అదే నిజమైతే ప్రధాని, ఇతర నాయకులు కాంగ్రెస్ లక్ష్యంగా దాడులు దిగే అవకాశం వచ్చెడిది కాదు. మూడో దశ పోలింగ్‌కు ముందు బిజెపి అభ్యర్థులకు ప్రధాని మోడీ రాసిన బహిరంగ లేఖలో కాంగ్రెస్ తిరోగమన రాజకీయాలను ఎండగట్టాలని పిలుపిచ్చారు. పరోక్షంగా కాంగ్రెస్‌కు ప్రాణం పోస్తున్నారా? తమ వైఫల్యాలు కాంగ్రెస్‌కు ఎక్కడ ప్రాణం పోస్తాయో అని ఆందోళన చెందుతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరోవంక, 75 ఏళ్లలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఎన్నికల ప్రచారం కోసం రాజకీయ పక్షాలు ఖర్చు చేస్తున్నాయి.

మితిమీరిన ఎన్నికల వ్యయం మన ప్రజాస్వామ్యం ఉనికి సవాల్ గా మార్చే విధంగా కనిపిస్తున్నది. 2019 ఎన్నికలలో రూ. 60,000 కోట్లు ఖర్చు చేస్తే, ఈ పర్యాయం అందుకు రెట్టింపుకన్నా ఎక్కువుగా రూ. 1.35 లక్షల కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉందని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సిఎంఎస్) ఛైర్మన్ ఎన్ భాస్కరరావు పేర్కొన్నారు. 35 ఏళ్లుగా ఎన్నికల వ్యయాన్ని మదింపు చేస్తున్న ఆయన ఈమొత్తాన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు, అభ్యర్థులు, ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌తో సహా ఎన్నికలకు సంబంధించిన అన్ని ఖర్చులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కలిగి ఉంటుందని తెలిపారు. అయితే, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం కోసం ప్రచారం కోసం చేస్తున్న వ్యయంలో అందరికన్నా చాలా అత్యధికంగా చేయడం కనిపిస్తున్నది.

అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్ (ఎడిఆర్) ఇటీవల జరిపిన పరిశీలన భారత దేశంలో రాజకీయ నిధులలో ‘గణనీయమైన పారదర్శకత లోపాన్ని’ వెల్లడిస్తుంది. 2004-05 నుండి 2022 -23 వరకు, దేశంలోని ఆరు ప్రధాన రాజకీయ పార్టీలకు సుమారు 60 శాతం విరాళాలు, మొత్తం రూ. 19,083 కోట్లు, ఎలక్టోరల్ బాండ్ల నిధులతో సహా తెలియని మూలాల నుండి వచ్చినట్లు వెల్లడైంది. అంటే మన ఎన్నికల వ్యవస్థపై పెరుగుతున్న నల్లధనం, ఆర్థిక నేరస్థుల ప్రభావం ఆందోళన కలిగిస్తున్నది. గతంలో ఏనాడూ లేని విధంగా ఈ ఎన్నికలలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఒక విధంగా ‘అక్రమ సంపాదనాపరులు’ను నిలబెట్టేందుకు పోటీపడ్డాయి.

బిజెపి వందకు పైగా సీట్లలో పార్టీ పట్ల అంకిత భావం కలిగిన నేతలను తొలగించి, అనుమానాస్పద మార్గాల ద్వారా సంపన్నులైన వారిని అభ్యర్థులుగా నిలబెట్టింది. మోడీ మంత్రివర్గంలో అందరి కన్నా నిజాయితీపరులుగా పేరున్న జనరల్ వికె సింగ్, అశ్విని చౌబే వంటి వారికి ఈసారి సీట్లు ఇవ్వకుండా, వారి స్థానంలో వ్యాపారులకు సీట్లు ఇవ్వడం వారిద్దరూ అవినీతి మార్గాల ద్వారా డబ్బు సంపాదించకపోవడమే కారణం. బిజెపి అభ్యర్థులలో నాల్గవ వంతు మంది ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత పార్టీలోకి వచ్చి చేరినవారు. వారిలో అత్యధికులు ఆర్థికపరమైన ఆరోపణలను అంతకు ముందు వరకు బిజెపి నేతల నుండి ఎదుర్కొంటున్నవారే. అందుకనే బిజెపికి ‘వాషింగ్ మెషిన్’ అనే పేరును ప్రతిపక్షాలు ఇచ్చాయి. బిజెపి కనుసన్నలలో వ్యవహరించకపోతే హేమంత్ సొరేన్, అరవింద్ కేజ్రీవాల్, కవిత వంటి వారి మాదిరిగా జైలుకు వెళ్లాల్సి వస్తుందనే పరిస్థితి నెలకొంది. అయితే ఈ విషయంలో ప్రతిపక్షాలు, వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయపక్షాలు సైతం అవినీతిపరుల కొమ్ముకాయడంలో వెనుకబడిలేదు. పార్టీలు ఏవైనా మన రాజకీయాలను అవినీతిపరులు, ఆర్థిక నేరాలకు పాల్పడేవారు శాసించే పరిస్థితులు నెలకొనడం నేడు మన ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రమాదం.

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News