Monday, December 23, 2024

90 శాతం జనాభాకు న్యాయం దక్కడమే నా జీవితాశయం

- Advertisement -
- Advertisement -
కులగణన అంటే మోడీ భయపడుతున్నారు
ఓబిసినని చెప్పుకుని ఇప్పుడు కులమే లేదంటున్నారు
కాంగ్రెస్ మేనిఫెస్టో విప్లవాత్మకం
సంపన్నులతో సమానంగా బడుగులకూ సాయం
అధికారంలోకి వచ్చాక కులగణనకే తొలి ప్రాధాన్యం
ప్రధాని మోడీ ఆరోపణలకు రాహుల్ గాంధీ కౌంటర్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోపై ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం ఘాటుగా జవాబిచ్చారు. ఇది రాజకీయ సమస్య కాదని, దేశ జనాభాలో 90 శాతం ఉన్న బడుగు వర్గాలకు న్యాయం చేయడమే తన జీవితాశయమని రాహుల్ ప్రకటించారు. దేశ భక్తులమని తమను తాము చెప్పుకుంటున్న వారు కుల గణన ద్వారా దేశానికి ఎక్స్‌రే తీస్తామంటే భయపడిపోతున్నారని రాహుల్ విమర్శించారు. బుధవారం నాడిక్కడ సమృద్ధ భారత్ ఫౌండేషన్ నిర్వహించిన సామాజిక్ న్యాయ్ సమ్మేళన్‌లో రాహుల్ ప్రసంగిస్తూ అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్టా మహోత్సవంలో కాని పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో కాని ఒక్క దళితుడు కాని గిరిజనుడు కాని ఓబిసి వ్యక్తి కాని కనిపించలేదని, పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి దేశానికే తొలి ఆదివాసీ రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ముకు ఆహ్వానం కూడా లేదని చెప్పారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రధాని ఆరోపణలను తిప్పికొడుతూ అది విప్లవాత్మకమైన మేనిఫెస్టోగా ఆయన అభివర్ణించారు. తమ మేనిఫెస్టో చూసి ప్రధాని మోడీ భయకంపితులయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. గత పదేళ్లుగా తాను ఓబిసినంటూ ప్రతిఒక్కరికి చెప్పుకుంటున్న మోడీ తాను కుల గణన గురించి మాట్లాడడం ప్రారంభించగానే అసలు కులమే లేదంటూ మాట్లాడుతున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. అసలు కులమే లేకపోతే నేను ఓబిసిని అంటూ ఎందుకు చెప్పుకున్నారని ప్రధాని మోడీని రాహుల్ నిలదీశారు. ఆ తర్వాత పేద, ధనిక అనే రెండే కులాలు ఉన్నాయంటూ మోడీ చెప్పడం ప్రారంభించారని, ఆయన మాటలే నిజమైతే పేదలను లెక్కిద్దామని, 90 శాతం పేదలు దళితులు, ఆదివాసీలు, ఓబిసిలే ఉంటారని రాహుల్ చెప్పారు.

సంపన్నులలో ఈ కులాల వారు మీకు కనపడరని ఆయన అన్నారు. తనకు ఇది రాజకీయ సమస్య కాదని, ఇది తనకు జీవితాశయమని రాహుల్ చెప్పారు. రాజకీయ సమస్యలకు, జీవాతాశయానికి చాలా తేడా ఉంటుందని, రాజకీయాలలో రాజీపడడాలు ఉంటాయి కాని జీవితాశయాలలో ఉండవని ఆయన అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తమ ప్రథమ ఎజెండా కులగణనేనని ఆయన ప్రకటించారు. దేశంలోని మీడియా, న్యాయ వ్యవస్థ, ప్రైవేట్ ఆసుపత్రులు, బడా కంపెనీలు వంటి రంగాలలో దళితులు, ఆదివాసీలు, ఓబిసిల ఉనికి చాలా తక్కుగా ఉందని ఆయన తెలిపారు.నాకు కులాల పట్ల ఆసక్తి లేదు.

నాకు న్యాయం అంటేనే ఆసక్తి. నేడు దేశంలోని 90 శాతం మందికి అన్యాయం జరుగుతోంది. న్యాయం జరగాలని నేను మాట్లాడిన ప్రతిసారి దేశంలో చీలికలు తేవడానికి ప్రయత్నిస్తున్నారంటూ ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. భారతదేశానికి మంచి జరగాలని దేశభక్తి ఉన్న ప్రతిఒక్కరూ కోరుకుంటారు. అందు కోసం 90 శాతం జనాభా శక్తిని మనం వినియోగించుకోవాలి. తమను తాము దేశభక్తులమని చెప్పుకుంటున్న వారు ఎక్స్‌రే అంటే భయపడిపోతున్నారు అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. తన ఆర్థిక ఎజెండాను ఆయన వివరిస్తూ బడా వ్యాపార సంస్థలకు సాయం చేయకూడదని లేదా ప్రోత్సహించకూడదని తాను చెప్పడం లేదని, వారికి రూ. 100 ఇస్తే దేశంలోని 90 శాతం జనాభాకు కూడా అంతే మొత్తాన్ని ఇవ్వాలని తాను చెబుతున్నానని రాహుల్ చెప్పారు.

కనీసం ఇందు కోసం చర్యలు తీసుకుంటామని కూడా వారి నోటి నుంచి రావడం లేదని ఆయన బిజెపి ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశంలోని బడుగు వర్గాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆమడ దూరంలో ఉంచుతోందని ఆయన ఆరోపించారు. అయోధ్యలో రామాలయం ప్రాంరభించినపుడు నేను మిమిల్ని(దళితులు, ఆదివాసీలు, ఓబిసిలు) చూడలేదు. పార్లమెంట్ భవనం ప్రారంభించినపుడు ఆదివాసీ మహిళ అయిన రాష్ట్ర ద్రౌపది ముర్ము అక్కడ లేరు. దీన్ని బట్టి అర్థమవుతున్నదేమిటంటే అధికారాన్ని పంచుకోవాల్సి వచ్చినపుడు మీకు అక్కడ స్థానం ఉండదు.

దేశానికి ప్రథమ మహిళ అయిన ఫష్ట్రపతి పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సి ఉండగా ఆమెను దూరం పెట్టారు అంటూ రాహుల్ ఆరోపించారు. తనపై జరుగుతున్న మాటల దాడిని ఆయన ప్రస్తావిస్తూ తనకు రాజకీయాలపై ఆసక్తి కాని శ్రద్ధ కాని లేవని మీడియా చెబుతుంటుందని ఆయన విమర్శించారు. భూ సేకరణ బిల్లు, నరేగా, నియంగిరి, భట్టా పర్సోల్ సీరియస్ అంశాలు కావా అని ఆయన ప్రశ్నించారు. దేశంలోని అత్యధిక శాతానికి చెందిన వర్గాల గురించి మట్లాడితే తనను రాజకీయాలకు నాన్ సీరియస్ అంటారని, అదే అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ గురించి మాట్లాడితే సీరియస్(సమస్యలు) అంటారని రాహుల్ మీడియాకు చురకలు అంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News