పాలక్కాడ్(కేరళ): ఆర్థిక పరిస్థితి దిగజారడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, వయనాడ్ ఎంపి రాహుల్ గాంధీ విమర్శించారు. ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళలో శుక్రవారం తన రెండవ విడత ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్ దేశంలోను, రాష్ట్రంలోను ఆర్థిక పరిస్థితి చాలా బలహీనంగా ఉందని, పెద్ద నోట్ల రద్దు, అస్తవ్యస్త జిఎస్‌టి కారణంగా పరిస్థితి దారుణంగా తయారయ్యిందని అన్నారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం, రాష్ట్రంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం విఫలమయ్యాయని ఇక్కడ ఒక ఎన్నికల ప్రచార సభలో ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో సిపిఎం సారథ్యంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలను ఆయన ఎద్దేవా చేస్తూ పెట్రోల్ పోయకుండా కారును నడపాలని ప్రయత్నించినట్లు ఉందని వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థలోకి డబ్బును పెద్ద ఎత్తున పంపిణీ చేయాల్సి ఉంటుందని, తాము ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టినపుడు చాలామంది దీన్ని విమర్శించారని, ఆ తర్వాత తమ తప్పు తెలుసుకున్నారని ఆయన చెప్పారు. తాము 2019 ఎన్నికల సందర్భంగా తమ పార్టీ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన న్యాయ్ పథకం వల్ల ఆర్థిక వ్యవస్థ బలపడి సామాన్య ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని, దీని వల్ల ఉత్పాదక రంగం పుంజుకుని కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆయన తెలిపారు.