పణాజీ: పర్యావరణం, ఉపాధి కల్పన వంటి అసలు సమస్యల నుంచి గోవా ప్రజలను ప్రధాని నరేంద్ర మోడీ పక్కదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ తలచుకుంటే 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొద్ది గంటల్లోనే గోవాకు కూడా విముక్తి లభించేదని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను రాహుల్ తప్పుపట్టారు. శుక్రవారం మర్గోవాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అప్పటి పరిస్థితిని, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతి పరిణామాలను మోడీ అర్థం చేసుకోలేదని అన్నారు. అప్పటి చరిత్రను మోడీ అర్థం చేసుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. అసలు సమస్యల నుంచి గోవా ప్రజలను పక్కదారి పట్టించడానికే మోడీ ఈ వ్యాఖ్యలు చేశారని ఆయన విమర్శించారు. హిజాబ్ వివాదం గురించి విలేకరులు ప్రశ్నించగా గోవా ప్రజల దృష్టి మళ్లించడానికి తాను ఎటువంటి వివాదాలను ఇప్పుడు ప్రస్తావించదలచుకోలేదని రాహుల్ స్పష్టం చేశారు. గోవా ప్రజలను ఏది ముఖ్యమో దానిపైనే తాను దృష్టి నిలుపుతానని ఆయన అన్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Rahul Gandhi denies Modi’s Comments on Goa