Thursday, December 19, 2024

లోక్‌సభలో రాహుల్ గాంధీపై అనర్హత వేటు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: 2019 పరువునష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా కోర్టు నిర్దారించడంతో ఆయనపై లోక్‌సభలో అనర్హత వేటు పడింది. లోక్‌సభ సెక్రటరియేట్ మార్చి 24న ఈ విషయాన్ని పేర్కొంది. ‘కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ఆర్టికల్ 102(1)(ఈ)లోని నిబంధనల ప్రకారం దోషిగా తేలిన తేదీ నుంచి..అంటే, 23 మార్చి 2023 నుంచి లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడయ్యాడు. భారత రాజ్యాంగం ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951 లోని సెక్షన్ 8ని ఈ సందర్భంగా చదవాలి’ అని ఆ ప్రకటన పేర్కొంది. ఆయన దోషిగా నిర్ధారితమైన మార్చి 23 నుంచి వాయ్‌నాడ్ ఎంపీ పదవికి అనర్హుడయ్యారని పార్లమెంటు సెక్రటరియేట్ తన ప్రకటనలో పేర్కొంది.

దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరామ్ రమేశ్ ప్రతిస్పందించారు. ఈ విషయంలో పార్టీ న్యాయపరంగానూ, రాజకీయపరంగానూ పోరాడుతుందని ఆయన ట్వీట్ చేశారు. ‘ప్రధానిఅదానీ మెగా స్కామ్‌లో సంయుక్త పార్లమెంట్ కమిటీ(జెపిసి) దర్యాప్తుకు ఆదేశించడానికి బదులు, రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారు. భారతీయ ప్రజాస్వామ్యం..ఓమ్ శాంతి’ అని ఆయన పోస్ట్ పెట్టారు.

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సైతం ‘ఈ చర్యకు నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. కోర్టు 24 గంటలలోనే తీర్పు ఇవ్వడంలో అసాధారణ వేగం కనబరిచింది. అప్పీల్ ఒక్కటే మిగిలిన మార్గం. రాజ్యాంగ సంస్థలు, రాజకీయాలతో చేతులు కలిపాయి, ఇది మన ప్రజాస్వామ్యానికి చేటు కాలం తేనుంది’ అని ట్వీట్ చేశారు.

గుజరాత్‌లోని సూరత్ కోర్టు మార్చి 22న పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. బిజెపి ఎంఎల్‌ఏ పూర్ణేశ్ మోడీ ఫిర్యాదును కోర్టులో దాఖలు చేశాడు. ‘దొంగలందరికీ ఎలా ఉమ్మడి ఇంటిపేరుగా మోడీ తయారయింది?’ అని రాహుల్ గాంధీ ఒకానొక సందర్భంగా అన్నదానిపై ఈ తతంగం అంతా జరిగింది. 52 ఏళ్ల రాహుల్ గాంధీని ఐపిసి సెక్షన్‌లు 499, 500 కింద చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ హెచ్.హెచ్. వర్మ దోషిగా తేల్చేశారు. హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకుగాను 30 రోజుల వరకు శిక్ష అమలు చేయకుండా బెయిల్‌ను కూడా మంజూరు చేశారు.

ఒకవేళ అప్పీలెట్ కోర్టు శిక్షను, రెండు ఏళ్ల జైలు శిక్షను రద్దు చేస్తే రాహుల్ గాంధీ అనర్హత వేటు నుంచి తప్పించుకుని లోక్‌సభ సభ్యుడిగా కొనసాగవచ్చు. చూడాలి ముందు ముందు ఏమి జరుగుతుందో?

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News