Thursday, December 19, 2024

నిందితుని రక్షించే యత్నం: కోల్‌కతా హత్యాచారంపై రాహుల్ అనుమానాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఒక ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటనపై కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రి, స్థానిక అధికారులు వ్యవహరించిన తీరును లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ‘నిందితుని రక్షించే యత్నం జరుగుతోంది’ అని రాహుల్ ఆరోపించారు. ‘కోల్‌కతాలో ఒక జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనపై సమస్త దేశం దిగ్భ్రాంతి చెందింది. ఆమెపై అమానుష కృత్యానికి సంబంధించిన వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. వైద్యుల సమాజంలో, మహిళల్లో అభద్రత వాతావరణం నెలకొన్నది’ అని రాహుల్ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు.

‘బాధితురాలికి న్యాయం చేకూర్చడానికి బదులు నిందితుని కాపాడేందుకు జరిగిన ప్రయత్నం ఆసుపత్రిపైన, స్థానిక అధికార యంత్రాంగంపైన తీవ్ర అనుమానాలు రేకెత్తిస్తోంది’ అని ఆయన తెలిపారు. ‘హథ్రాస్ నుంచి ఉన్నావ్ వరకు, కథువా నుంచి కోల్‌కతా వరకు’ మహిళలపై నానాటికీ పెరుగుతున్న అఘాయిత్యాలపై ప్రతి పార్టీ, సమాజంలోని ప్రతి వర్గం తీవ్రంగా చర్చలు జరిపి, పటిష్ఠమైన చర్యలు తీసుకోవలసి ఉంటుందని రాహుల్ సూచించారు.

‘ఒక ఆసుపత్రి వంటి ప్రదేశంలోనే వైద్యులకు రక్షణ కొరవడితే తల్లిదండ్రులు చదువుల కోసం తమ కుమార్తెలను ఎలా పంపగలరని మనం ఆలోచించవలసిన అగత్యాన్ని ఈ ఘటన కల్పిస్తోంది. నిర్భయ కేసు తరువాత తీసుకువచ్చిన కఠిన చట్టాలు కూడా అటువంటి నేరాల కట్టడిలో ఎందుకు విఫలం అవుతున్నాయి’ అని రాహుల్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News