చండీగఢ్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం హర్యానాలోని సోనిపట్‌లో అనూహ్యంగా రైతులతో మమేకం అయ్యారు, ఢిల్లీ నుంచి హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లుతుండగా మదీనా గ్రామం శివార్లలో ఆగారు. అక్కడి వరిపొలంలో పనులు చేసుకుంటున్న రైతుల వద్దకు వెళ్లి దాదాపు రెండున్నర గంటల పాటు పొలం, పరిసరాలలోనే గడిపారు. నాట్లు వేస్తూ ఉన్న రైతులతో ముచ్చటించారు. పనిలో పనిగా తాను కూడా రైతు అయ్యిపోయినట్లుగా పంట పొలం పనులకు దిగారు. ఓ వైపు చిరుజల్లులు పడుతూ ఉన్నప్పటికీ ఉదయం 6.40 ప్రాంతంలో రాహుల్ అక్కడికి వచ్చారు. ట్రాక్టరు నడిపి కొంత సేపు పొలం చదును చేశారు. వ్యవసాయ క్షేత్రాల్లోకి మహిళా కూలీలు తీసుకువచ్చిన ఆహారం తీసుకున్నారు.
రాహుల్ వస్తున్నట్లు , నేరుగా పంటపొలాల్లోకి వెళ్లినట్లు తమకు చాలా సేపటి వరకూ తెలియదని సోనిపట్‌లోని గోహానా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్బీర్ సింగ్ మాలిక్ వార్తా సంస్థలకు ఫోన్‌లో తెలిపారు. రాహుల్ వచ్చినట్లు తెలియగానే మాలిక్ మరో ఎమ్మెల్యే ఇందురాజ్ నర్వాల్‌తో కలిసి చేరుకున్నారు. తమ పంటపొలాల వద్ద రాహుల్ కారు ఆగడంతో తాము చాలా సేపటివరకూ తేరుకోలేకపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. రాహుల్ పొలంబాటను తెలిపే ఫోటోలను కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత తమ ట్విట్టర్‌లో పొందుపర్చింది. తెల్లటి టీషర్టు , ప్యాంటుతో అక్కడికి వచ్చిన రాహుల్ ప్యాంటును పైకి మడిచి బూట్లు తీసి చేతుల్లో పట్టుకుని బురదలో అక్కడి రైతులతో కలిసి ముందుకు సాగిన ఫోటోలను పొందుపర్చారు. రాహుల్ ఫోటోలను కాంగ్రెస్ సీనియర్ నేతలు రణదీప్ సింగ్ సూర్జేవాలా, దీపేందర్ సింగ్ హూడా కూడా పోస్టు చేశారు.