అస్సాం సిఎం హిమంత శర్మ
గువాహటి : అస్సాంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సమయంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఉపయోగించినట్లుగా భావిస్తున్న ‘దూప్’ పేరును, చిరునామాను తాను త్వరలో వెల్లడి చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. గురువారం విలేకరుల గోష్ఠిలో ‘డూప్’ను ఉపయోగించినట్లు కాంగ్రెస్ ఎంపి చేసిన ఆరోపణను హిమంత ప్రస్తావించారు. యాత్ర సమయంలో వాహనంపై కూర్చొని, జనం వైపు చేతులు ఊపిన వ్యక్తి ‘బహుశా రాహుల్ గాంధీయే కాదు’ అని ఒక వార్తను సిఎం ఉటంకించారు.
‘నేను ఊరికే మాటలు అనను. డూప్ పేరును, అలా ఎలా జరిగిందీ అన్ని వివరాలూ నేను వెల్లడిస్తాను. కొన్ని రోజులు వేచి చూడండి’ అని సిఎం శర్మ శనివారం సోనిత్‌పూర్ జిల్లాలో ఒక కార్యక్రమంలో సూచించారు. రాహుల్ గాంధీపై వచ్చిన ఆరోపణల గురించి విలేకరులు ప్రశ్నించినప్పుడు సిఎం ఆ సమాధానం ఇచ్చారు. ‘నేను ఆదివారం దిబ్రూగఢ్‌లో ఉన్నాను. సోమవారం గువాహటికి దూరంగా ఉంటాను.
గువాహటికి తిరిగి చేరుకున్న తరువాత నేను డూప్ పేరు, చిరునామా వెల్లడిస్తాను’ అని సిఎం చెప్పారు. రాహుల్ గాంధీ సారథ్యంలో మణిపూర్‌లో మొదలైన భారత్ జోడో న్యాయ్ యాత్ర నెల 18 నుంచి 25 వరకు అస్సాం మీదుగా సాగింది. ఆ సమయంలో హిమంత శర్మను ‘భారత్‌లో అత్యంత అవినీతిమయ సిఎం’గా కాంగ్రెస్ ఎంపి ఆరోపించారు. కాగా, అస్సాంలో తనను ఓడించేందుకు ‘గాంధీలు అందరూ’ సోనియా, ప్రియాంక, రాహుల్ అవసరం కాంగ్రెస్‌కు ఉంటుందని శర్మ చెప్పారు.