Sunday, December 22, 2024

దేశానికి ‘అవినీతి రాజధాని’ మధ్యప్రదేశ్: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

నీముచ్: మధ్యప్రదేశ్ దేశానికి అవినీతి రాజధాని అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతోందని ఆయన దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాలో సోమవారం జరిగిన పార్టీ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రూ.500 కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తుందని, రూ.2 లక్షల దాకా రైతు రుణాలను మాఝీ చేస్తుందని, గోధుమలకు రూ.2,600 కనీస మద్దతు ధరను అందిస్తుందని, వంద యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ అందిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.

230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో ఈ నెల 17వ తేదీన పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని , 27 లక్షల మంది వ్యవసాయదారుల రుణాలను మాఫీ చేయడం ద్వారా రైతు సంక్షేమం కోసం పని చేయడం ప్రాంభించగానే బిజెపి బడా పారిశ్రామికవేత్తలతో కుమ్మక్కయి రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారుల ప్రభుత్వాన్ని లాగేసుకుని దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని రాహుల్ అన్నారు.

కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమార్ కుమారుడు, ఓ మధ్యవర్తి కూర్చుని కోట్ల రూపాయల గురించి మాట్లాడుకుంటున్నట్లుగా ఉన్న ఓ వీడియో గురించి కూడా రాహుల్ ప్రస్తావిస్తూ, తోమార్‌జీ కుమారుడు మీ సొమ్మును దోచుకుంటుండడం ఆ వీడియోలో చూడవచ్చన్నారు. ఇక్కడి బిజెపి ఎంఎల్‌ఎలు, మంత్రులు అంతకన్నా తక్కువేమీ కాని, దోచుకోవడంతో తోమార్ కుమారుడితో పోటీ పడుతున్నారని అన్నారు. అప్పుల కారణంగా మధ్యప్రదేశ్‌లో 18 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణాలను మాఝీ చేయడం ప్రారంభించగానే బిజెపి ఆ ప్రభుత్వాన్ని దొడ్డిదారిన లాగేసుకుందని విమర్శించారు.

మధ్యప్రదేశ్‌లో 500 ఫ్యాక్టరీలను బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగంగా అబద్ధాలు చెప్పారని కూడా రాహుల్ ఆరోపించారు. నీముచ్ జిల్లాలో ఒక్క ఫ్యాక్టరీ అయినా ఏర్పాటయిందా అని ఆయన సభకు హాజరయిన ప్రజలనుద్దేశించి అడిగారు. తాను ఒబిసిల గురించి మాట్లాడడం మొదలు పెట్టిన రోజునుంచి అప్పటిదాకా తాను ఒబిసినని చెప్పుకుంటూ వచ్చిన ప్రధాని మోడీ దాని గురించి మాట్లాడడం మానేశారని అన్నారు. ఇప్పుడాయన హిందుస్థాన్‌లో ఏ కులం లేదని, ఉన్న కులమల్లా పేదరికమొక్కటేనని అంటున్నారని వ్యంగ్యంగా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News