Sunday, December 22, 2024

అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌కే మొగ్గు.. తెలంగాణలో విజయావకాశాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈ ఏడాది చివరిలో జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో విజయావకాశాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల్లో తప్పనిసరిగా గెలుపు కాంగ్రెస్‌దే. కాగా రాజస్థాన్‌లో తీవ్రస్థాయి పోటీ నెలకొన్నా, చివరికి తమ పార్టీనే విజయం సాధిస్తుందని విశ్లేషించారు. అసోంకు చెందిన ప్రతిదిన్ మీడియా నెట్‌వర్క్ ఏర్పాటు చేసిన ఓ సదస్సులో రాహుల్ గాంధీ ఆదివారం మాట్లాడారు. మొత్తం మీద అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ సత్ఫలితాలు సాధిస్తుందని ఆయన వివరించారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజల వాస్తవిక సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు జమిలి ఎన్నికలను తెరపైకి తెచ్చిందని విమర్శించారు. దేశంలో కులగణన అవసరం అనేదే ప్రతిపక్షాల డిమాండ్ అని, ఈ ప్రక్రియ అత్యవసరం అని తెలిపారు. లోక్‌సభలో బిఎస్‌పి నాయకులు డానిష్ అలీపై బిజెపి ఎంపి రమేష్ బిధూరి అవమానకర వ్యాఖ్యలకు దిగారని , కులగణన డిమాండ్‌ను తిప్పికొట్టేందుకే బిజెపి ఈ విధంగా దూకుడుగా వ్యవహరిస్తోందని తెలిపారు. ప్రజలు దైనందిన జీవితంలో పలు రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, ఈ అంశాల గురించి ప్రజల దృష్టిని మళ్లించి, రాజకీయ లబ్ధి పొందడమే బిజెపి ఎత్తుగడలలో భాగమని విమర్శించారు.

సంపద ఒకే చోట కేంద్రీకృతం కావడం, అసమానతలు పెరిగిపోవడం, నిరుద్యోగం, అట్టడుగు స్థాయి కులాల పట్ల తీవ్రస్థాయి అన్యాయం , ఒబిసిలు, ఆదివాసీలను పట్టించుకోకపోవడం, ధరలకు కళ్లెం వేయలేకపోవడం వంటివి తీవ్రస్థాయి విషయాలని తెలిపారు. కర్నాటకలో పార్టీ విజయం తమకు పలు విధాలుగా పాఠాలు నేర్పిందని రాహుల్ చెప్పారు. పొరుగున ఉన్న తెలంగాణలో , మధ్యప్రదేశ్‌లో ఇతర ప్రాంతాలలో కాంగ్రెస్ పదునైన వ్యూహాలతో ఎన్నికలకు వెళ్లుతుందని రాహుల్ తెలిపారు.

కులగణన అంటే బిజెపికి రుచించదు
చట్టసభలలో , ఇతరత్రా వెలుపల కులగణన డిమాండ్ వస్తే దీనిని పక్కదోవ పట్టించేందుకు బిజెపి తెలివిగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ నేత తెలిపారు. ఈ ప్రబుద్ధులు బిధూరి, ఇప్పుడు నిశికాంత్ దూబే వంటి బిజెపి నేతలు చర్చను పక్కదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. కులాలవారి గణన అవసరం ఉందని, దేశవ్యాప్తంగా ఇది ప్రజలందరి ప్రాధమిక ఇచ్ఛ అని బిజెపివారికీ తెలుసునని , అయితే దీనిని అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ప్రబలంగా ఉందని, అక్కడ బిజెపి తుడిచిపెట్టుకుపోతుందని విశ్లేషించారు. రాజస్థాన్ విషయానికి వస్తే అక్కడ అధికార వ్యతిరేకత ఉందనే వాదన నెలకొంది. అయితే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారనేది మౌలిక స్థాయిలోని విషయం అన్నారు. కాగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పుడు కాంగ్రెస్‌కు నిర్థిష్ట రీతిలో ప్రాబల్యం ఉందన్నారు.

అనుకుంటే రేపు పొద్దుటికి మహిళా కోటా అమలు చేయవచ్చు
కేంద్రం చెప్పేదొక్కటి చేసేదొక్కటి అని పేర్కొన్న రాహుల్ మహిళా బిల్లుకు డిలిమిటేషన్, జనాభా లెక్కలకు ఎటువంటి సంబంధం లేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే మహిళా బిల్లును 24 గంటల్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు వర్తింపచేయవచ్చునని చెప్పారు. వెనువెంటనే చట్టసభలలో మహిళలకు 33 శాతం కోటా అమలు చేస్తున్నామని చెప్పేయవచ్చునని , కానీ దీనిపై సాగదీతలే కేంద్ర ప్రభుత్వ వైఖరి అని విమర్శించారు.

అదానీ అంశంపై దాటవేతకు ప్రత్యేక పార్లమెంట్
ఫైనాన్షియల్ టైమ్ ఇతర పత్రికలలో అదానీ వ్యవహారాలపై వచ్చిన కథనాలతో కేంద్రం ఖంగుతింది. వీటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, వారి ఆలోచనాపధం మారేందుకు ఉన్నట్లుండి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ముందుగా ఈ సెషన్‌లో దేశం పేరును ఇండియా నుంచి భారత్‌కు మార్చాలనే ప్రకటనకు దిగాలనుకున్నారు. అయితే దీనిపై తీవ్ర వ్యతిరేకత తలెత్తింది. దీనితో ఈ మహిళా బిల్లును తీసుకువచ్చారని చెప్పారు. ఈ బిల్లు ఫలాలు మహిళలకు పది సంవత్సరాల తరువాత అందుతాయని బిజెపి షరతు పెట్టింది. అయితే కాంగ్రెస్ ఈ కోటా వాటా మహిళకు ఇప్పటికిప్పుడు అందాలని కోరుతోందన్నారు.

చివరికి గెలిచేది మాస్‌మీడియానే
తాను జరిపిన 4000 కిలోమీటర్ల భారత్ జోడో యాత్రలో పలు సత్యాలు వెలుగులోకి వచ్చాయని రాహుల్ తెలిపారు. 21వ శతాబ్ధపు భారతదేశంలో ఇప్పుడు సమాచార ప్రక్రియ అంతా కూడా బిజెపి గుప్పిట్లోకి జారుకుంది. దీనితో ఈ ప్రత్యక్ష మీడియాతో ప్రజల వద్దకు వెళ్లడం అసాధ్యం అయిందనే విషయం ప్రజలను ముఖాముఖీ కలిసిన తరువాత తనకు తెలిసిందన్నారు. ప్రజలను పక్కదోవ పట్టించే పద్ధతులు ఎన్ని చలామణిలో ఉన్నా దీనిని ఎదుర్కొనే విధానాలూ ఉంటాయని రాహుల్ స్పష్టం చేశారు.

ప్రజలను నేరుగా కలవడం కీలకమనేది ఓ పెద్ద బాలశిక్ష వంటి అధ్యయన ప్రక్రియ అని ఆధునిక యుగంలో మహాత్మా గాంధీ వంటి వారు ఈ పద్థతికి తెరతీశారని తెలిపారు. మీడియా ద్వారా సమాచారాన్ని కంట్రోలు చేసేందుకు బిజెపి ఎంతటి శక్తియుక్తులను, వనరులను పెట్టినా అవి పనిచేయబోవని తెలిపారు. ప్రజలతో ముఖాముఖీ కలుసుకోవడం జరిగితే ఇక తప్పుడు మీడియా వార్తలతో ఎటువంటి ప్రభావం ఉండదన్నారు. తప్పుదోవ పట్టి పట్టించేందుకు యత్నించే రియల్ మీడియాకు కౌంటర్‌గా ఎప్పటికప్పుడు తలెత్తే మాస్‌మీడియానే ఇప్పుడు కీలకం అవుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News