లక్నో: లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీకి కోర్టు జరిమానా విధించింది. అది కూడా కేవలం 200 రూపాయిలు మాత్రమే. అది ఎందుకంటే.. పదే పదే విచారణకు కోర్టుకు హాజరుకానందుకు.
అసలేం జరిగిందంటే.. స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ గాంధీపై పరువునష్టం దావా నమోదైంది. 2022లో ఓ మీడియా సమావేశంలో సావర్కర్ బ్రిటీష్ సేవకుడు అని.. ఆయన వారి నుంచి పెన్షన్ కూడా తీసుకున్నారని రాహుల్ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు సావర్కర్‌ను కించపరిచే విధంగా ఉన్నాయని.. నృపేంద్ర పాండే అనే వ్యక్తి యుపి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే ఈ కేసు విచారణ కోసం రాహుల్ గాంధీ లక్నోలోని అడిషనల్ చీఫ్ జ్యుడిషయల్ ముందు హాజరు కావాల్సి ఉండగా.. ఆయన హాజరుకాలేదు. రాహుల్ గాంధీ తరఫు న్యాయవాద ప్రన్షు అగర్వాల్ కోర్టుకు హాజరై రాహుల్ ప్రస్తుతం బిజీగా ఉన్నారని వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కావాలని కోర్టును కోరారు.
దీంతో రాహుల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఆయనకు రూ.200 జరిమానా విధించింది. ఏప్రిల్ 14వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా కోర్టు ఆదేశించింది. లేని పక్షంలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది.