”అగ్నిపథ్”పై రాహుల్ ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశానికి సేవ చేయాలన్న లక్షలాది మంది యువజనుల కలలను బిజెపి భగ్నం చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టిన అగ్నిపథ్ పథకంపై రాహుల్ తీవ్ర స్థాయిలో గురువారం మండిపడ్డారు. ఆ యువజనుల కన్నీళ్ల నుంచి ఉప్పెన ఎగసి ప్రధాని నరేంద్ర మోడీ పదవీ అహంకారాన్ని బద్ధలు కొట్టడం ఖాయమని ఆయన అన్నారు. సాయుధ దళాలలో చేరే అవకాశం కోల్పోయానంటూ ఒక యువకుడు కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియోను ట్విటర్ వేదికగా రాహుల్ గురువారం షేర్ చేశారు. గత రెండేళ్లుగా సాయుధ దళాలలో ఎటువంటి నియామకం జరగలేదని రాహుల్ తెలిపారు. 2018–19లో 53431, 2019-20లో 80572, 2020-21లో 0, 2021-22లో 0 నియామకాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. అగ్నివీరులను నాలుగేళ్ల కాంట్రాక్టులోకి తీసుకువచ్చి దేశానికి సేవ చేయాలని ఆశిస్తున్న లక్షలాదిమంది యువజనుల కలలను బిజెపి భగ్నం చేసిందని రాహుల్ అన్నారు.