ఇటానగర్: దేశాన్ని కులం, మతం, జాతి పేరిట బిజెపి చీలుస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. శనివారం ఆయన చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించింది. డోయిముఖ్‌లో ఆయన స్థానికులను ఉద్దేశించి మట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మతం, భాష పేరుతో ప్రజలు తమలో తాము ఘర్షణపడే విధంగా బిజెపి రెచ్చగొడుతోందని ఆయన ఆరోపించారు. పేద ప్రజల ప్రయోజనాల కన్నా కొద్ది మంది వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసమే బిజెపి పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. అయితే కాంగ్రెస్ మాత్రం ప్రజలను ఐక్యం చేసి వారి పరోభివృద్ధి కోసం కృషిచేస్తోందని ఆయన తెలిపారు. ఈ నెల 14న మణిపూర్‌లో ప్రారంభమై మార్చి 20న ముండైలో ముగియనున్న తన న్యాయ యాత్ర ఈశాన్య రాష్ట్ర ప్రజల వేదనలను చాటడానికే ఉద్దేశించిందని ఆయన చెప్పారు.
అరుణాచల్ ప్రదేశ్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించిన కాంగ్రెస్ పార్టీ పేదల సమస్యలను లేవనెత్తి యువజనులు, మహిళలు, బలహీన వర్గాల పురోభివృద్ధి కోసం పనిచేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని న్యాయ యాత్రలో భాగంగా తాను ప్రయాణిస్తున్న బస్సు పైనుంచి ప్రజలనుద్దేశించి ప్రంగిస్తూ రాహుల్ తెలిపారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చడానికి బిజెపియే కారణమని ఆయన ఆరోపించారు. బిజెపి హయాంలో పేదల సమస్యలను వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండదని, మీడియా కూడా పేదల కష్టాన్ని ప్రస్తావించదని ఆయన విమర్శించారు. తన యాత్రలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక గంటలపాటు తాను ప్రయాణిస్తూ ప్రజల వేదనను, కష్టాలను వినడానికి వివిధ ప్రదేశాలలో ఆగుతున్నానని ఆయన వివరించారు. అంతకుముందు..పాపుమ్ పరే జిల్లాలోని గుంటో చెక్ గేట్ వద్ద రాహుల్ గాంధీకి అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాబమ్ టూకి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా జెండా మార్పిడి కార్యక్రమం జరిగింది. అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భూపేన్ బోరా పతాకాన్ని టూకీకి అందచేశారు. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన సాంప్రదాయ నైషీ తలపాగాను ధరించిన రాహుల్ వంలాది మంది పార్టీ కార్యకర్తలు వెంటరాగా దోయిముఖ్‌కు ఊరేగింపుగా వెళ్లి బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం అక్కడి నుంచి బస్సులో నహరలగున్ చేరుకుని వీధి వ్యాపారులతో ముచ్చటించారు. ఆదివారం ఉదయం ఆయన హొల్లోంగి మీదుగా రాష్ట్ర రాజధానికి బయల్దేరి వెళతారు.