కేంద్రానికి రాహుల్ చురకలు
న్యూఢిల్లీ: స్నేహితుల కోసం మరిన్ని ఆస్తులను సంపాదించిపెట్టవద్దని, ప్రజల కోసం సరైన విధానాలను రూపొందించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. సామాజిక వంటశాల పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేసేందుకు ఒక విధానాన్ని రూపొందించడంపై కేంద్ర ప్రభుత్వ స్పందనపై సుప్రీంకోర్టు మంగళవారం అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో రాహుల్ బుధవారం స్పందించారు. ఆకలితో మరణిస్తున్న ప్రజలకు ఆహారాన్ని సమకూర్చవలసిన ప్రథమ బాధ్యత సంక్షేమ ప్రభుత్వాలపై ఉంటుందని పేర్కొంటూ రాష్ట్రాలతో మూడు వారాల్లో సమావేశం నిర్వహించి విధానాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ఇందుకు సంబంధించిన వార్తను రాహుల్ ట్యాగ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తన పారిశ్రామిక మిత్రులను మరింత సంపన్నులను చేయడాన్ని మాని ప్రజల సంక్షేమానికి పనికివచ్చే విధానాలను రూపొందించాలంటూ పరోక్షంగా చురకలంటిస్తూ హిందీలో ట్వీట్ చేశారు.