న్యూఢిల్లీ : ప్రధాని మోడీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లినప్పుడే మణిపూర్ పరిస్థితిపై ఆ దేశంలోనే జరిగిన ఇయూ పార్లమెంట్‌లో ప్రస్తావించారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ఏకంగా తీర్మానం కూడా చేశారని అయితే ఇప్పటికీ ప్రధాని మోడీ మణిపూర్‌పై కానీ ఇయూ ఆక్షేపణలపై కానీ కిమ్మనడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మణిపూర్ రగిలిపోతోంది. అంతర్జాతీయ వేదికలు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయినా మోడీకి వీటి గురించి మాట్లాడాలనే ఆలోచన రావడం లేదన్నారు. మొత్తం మీద మోడీ ఫ్రాన్స్‌తో రాఫెల్ ఒప్పందం ద్వారా ఆ దేశంలో పర్యటనకు దారి సుగమం చేసుకున్నారని , రాఫెల్‌తో ఆయనకు అక్కడి జాతీయ దినోత్సం నేపథ్యంలో బాస్టిల్ డే పరేడ్ టికెట్ దక్కిందని వ్యాఖ్యానించారు.
మూన్ సరే మణిపూర్ సంగతి ఏదీ
భారతదేశం ఇప్పుడు చంద్రుడి వద్దకు చేరుకునేందుకు రంగం సిద్ధం చేసుకుందని కానీ మణిపూర్‌లో సంక్లిష్టతలను పరిష్కరించుకునేందుకు వెనకడుగు వేస్తున్నామని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందించారు. ప్రధాని మోడీపై ఆయన విమర్శలు కురిపించారు. 1977లో ప్రముఖ ఆర్థికవేత్త రిచర్డ్ యాలే అప్పటి అమెరికా చంద్రమండల యాత్ర దశలో ఓ వ్యాసం రాశారని, మూన్ అండ్ గెట్టో అనే ఈ వ్యాసంలో సాంకేతిక విజయాల అమెరికా చంద్రుడి వద్దకు కూడా చేరుకొంటోంది కానీ పట్టణ ప్రాంతాల్లోని సాధారణ పౌరుల సమస్యలపై దృష్టి పెట్టలేకపోతోందనే ఈ వ్యాసం ఆలోచనాత్మకంగా ఉందన్నారు. దీనిని ఇప్పుడు మనం మూన్ అండ్ మణిపూర్ వ్యాసంగా పరిశీలించుకోవచ్చునని కాంగ్రెస్ నేత తెలిపారు. ముందు క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. తరువాత దేశ ఘనతల గురించి ప్రస్తావించుకోవచ్చు అని జైరాం రమేష్ తెలిపారు.