Wednesday, January 22, 2025

మణిపూర్ తగలబడుతుంటే ప్రధాని నోటా జోకులా?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గత నాలుగు నెలలుగా మణిపూర్ మండిపోతూ ఉంటే ప్రధాని అయ్యి ఉండి మోడీ నవ్వులు, జోకులకు దిగుతారా? ఇదేనా పద్దతి అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ దశలో ప్రధాని వ్యవహారశైలి దారుణంగా ఉందన్నారు. ఆయన విపక్షాలపై అవహేళనకు దిగారు. మరో వైపు తీవ్రస్థాయి విషయంపై జోకులకు దిగారని, ఇదంతా చూస్తూ ఉంటే ప్రధానికి మణిపూర్ మండిపోతూనే ఉండాలి, మణిపూర్ మండిపొయ్యేలా చేయాలనే ఆలోచన ఉన్నట్లుందని రాహుల్ తీవ్రస్థాయిలో శుక్రవారం ఇక్కడ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. వెనువెంటనే మణిపూర్‌లో హింసాకాండ ఆగిపోయి, అక్కడ శాంతిభద్రతలు, సాధారణ పరిస్థితులు నెలకొనడం అంతా కూడా ప్రభుత్వం చేతుల్లోనే ఉందని రాహుల్ చెప్పారు.

వెంటనే అక్కడ అల్లర్లను ఆపివేయించేందుకు అవసరం అయిన సాధనాలు అన్ని కూడా ప్రభుత్వం వద్ద ఉన్నాయని తెలిపారు. అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. సహాయక శిబిరాల్లోని మహిళలు తమపై జరిగిన అత్యాచారాలను తెలియచేసుకుంటున్నారు. మహిళలు, పిల్లలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వారు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మరి పార్లమెంట్‌లో ప్రధాని మధ్య సీటులో కూర్చుని పగులబడి నవ్వుతున్నారని విమర్శించారు. ఓ రాష్ట్రం పతనం చెందింది. ఇప్పుడు అక్కడ అరాచకం తప్ప మరోటి కన్పించడం లేదని, ఇదంతా కూడా బిజెపి విభజన, పాలన , జ్వలిత రాజకీయాల వల్లనే జరిగిందని ఆరోపించారు. రెండు గంటల పాటు ప్రధాని ప్రసంగించారు. మధ్యలో నవ్వులు, జోక్‌లతో తంతు సాగించారు. పైగా అధికార పక్ష సభ్యుల నుంచి నినాదాలు, బల్లచరుపులు విన్పించడం విచిత్రంగా ఉందన్నారు. ప్రధాని మాట్లాడుతూ ఉండగానే బిజెపి సభ్యులు మాటలతో సంబంధం లేనట్లుగా చప్పట్ల మోత పనిపెట్టుకున్నారని విమర్శించారు.
కుకీల, మైతీల మధ్య విషమించిన వైరం
తాము గాయపడ్డ మణిపూర్‌లో పర్యటించేందుకు వెళ్లామని అక్కడ కుకీలు,మైతీ తెగల మధ్య తీవ్రస్థాయి ఘర్షణలు నెలకొని ఉన్న విషయాన్ని గుర్తించామని చెప్పారు. తన 19 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇంతటి పరస్పర అపనమ్మకం, ఒకరిని చూసి మరొకరు ద్వేషించుకునే భయపడే పరిస్థితి చూడలేదని రాహుల్ చెప్పారు. కేంద్రీయ భద్రతా బలగాల అధికారికూడా ఇదే విషయం చెప్పారని అన్నారు. తాను మణిపూర్‌లో భరతమాత ఖూనీ అయిందని అన్నానని, తాను ఏదో పడిగట్టు పదజాలం వాడలేదని, సమయం సందర్భోచితంగానే దీనిని ప్రస్తావించానని తెలిపారు. అక్కడికి సైన్యం పంపిస్తే నెలరోజుల్లో పరిస్థితిని చక్కదిద్దుతారని రాహుల్ తెలిపారు.
ప్రధాని రాజకీయుడు కావద్దు
ఎవరైనా ప్రధాని అయితే పార్టీలకు అతీతంగా ఉండాలి. నిజానికి రాజకీయాలను త్యజించాలి. అప్పుడే ప్రజలకు సరైన ప్రతినిధిగా నిలుస్తారని , అందరికీ న్యాయం చేయగల్గుతారని రాహుల్ స్పష్టం చేశారు. పార్టీలు, రాజకీయాలు వేరు, అధికారంలోకి వచ్చిన తరువాత పాలనా నిర్వహణ తీరు వేరు , రెండింటిని మిళితం చేయరాదని సూచించారు.
పలువురు ప్రధానులను చూశాను: మోడీ విభిన్నం
తన తక్కువ రాజకీయానుభవంలో వేర్వేరు పార్టీల ప్రధానులను చూశానని, కాంగ్రెస్‌కు చెందిన వారు ఉన్నారు. బిజెపి నుంచి అటల్ బిహారీ వాజ్‌పేయిని ప్రధానిగా చూశాను. అదే విధంగా దేవెగౌడను కూడా పరిశీలించానని , ప్రధాని పదవి పట్ల వారి అభిప్రాయాలు నిర్థిష్టంగా పద్ధతి ప్రకారం ఉండేవని గుర్తించానని, అయితే భారతదేశ ప్రధాని పదవి పట్ల నరేంద్ర మోడీ జీ మసిష్కంలో పూర్తిగా అపార్థం నెలకొన్నట్లుగా కన్పిస్తోందని రాహుల్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News