Thursday, January 23, 2025

అదానీ కహానీ చెప్పండి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే గౌతమ్ అదానీ అనతికాలంలో ప్రపంచంలో రెండో అతిపెద్ద కుబేరుడిగా అవతరించారంటూ విమర్శించారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్ గాంధీ మంగళవారం మాట్లాడారు. ఈ సందర్భంగా గౌతమ్ అదానీ వ్యవహారం పై సుదీర్ఘంగా మాట్లాడారు. 2014లో బిజెపి అధికారంలోకి వచ్చాక అదానీ ప్రపంచ కుబేరుల్లో 609వ స్థానం నుండి రెండో ర్యాంక్‌కు చేరుకున్నారని అన్నారు. అదానీ కోసం ఏకంగా నిబంధనలనే మార్చేశారని దుయ్యబట్టారు.‘ఎయిర్‌పోర్టుల నిర్వహణలో పూర్వ అనుభవం లేనివారికి వాటి నిర్వహణ బాధ్యతలను అప్పగించకూడదని నిబంధనలు ఉన్నాయి. కానీ, ఆనిబంధనలను కేంద్ర ప్రభుత్వం మార్చివేసింది. ఏకంగా దేశంలోని ఆరు ఎయిర్‌పోర్టులను అదానీకి కట్టబెట్టింది. అత్యంత లాభదాయకమైన విమానాశ్రయాల్లో ఒకటైన ముంబయి ఎయిర్‌పోర్టును అదానీకి అప్పగించింది.

ఇందుకోసం జివికె గ్రూప్‌పై సిబిఐ, ఇడిలను ప్రయోగించింది’ అంటూ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ‘2014లో 8 బిలియన్ డాలర్లుగా ఉన్న అదానీ సంపద 2022 నాటికి 140 బిలియన్ డాలర్లకు ఎలా పెరిగిందని యువత అడుగుతున్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా తమిళనాడు, కేరళ, హిమాచల్ ప్రదేశ్.. ఇలా పాదయాత్ర చేపట్టిన ప్రతి చోటా అదానీ పేరు వినిపించింది. ఆయన అడుగు పెట్టిన ప్రతి వ్యాపారంలోనూ ఎలా సక్సెస్ అవుతున్నారంటూ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు’ అని రాహుల్ ఎద్దేవాచేశారు. “ప్రధాని మోడీ ఆస్ట్రేలియాకు వెళితే అదానీ గ్రూప్‌నకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 బిలియన్ డాలర్లు రుణం ఇచ్చింది. ప్రధాని బంగ్లాదేశ్ వెళితే అక్కడి పవర్ డెవలప్‌మెంట్ బోర్డు అదానీకి 25 ఏళ్ల కాంట్రాక్టు అప్పగించింది. ఇదేం మ్యాజిక్’ అని రాహుల్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఇప్పటి వరకు అదానీతో కలిసి ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లారు? విదేశాల్ల్లో ఎన్నిసార్లు అదానీని కలిశారు?ఎన్నిసార్లు ప్రధాని విదేశానికి వెళ్లి వచ్చాక అదానీకి ఆ దేశంనుంచి కాంట్రాక్ట్‌లు లభించాయి? బిజెపికి గడిచిన 20 ఏళ్లలో అదానీ ఎంతిచ్చారు? అంటూ రాహుల్ ప్రశ్నల వర్షం కురిపించారు.

హిందుస్థాన్ ఏరోనాటిక్స్( హెచ్‌ఎఎల్) విషయంలో రాజకీయాలు చేస్తున్నారని ప్రధాని నిన్న ఆరోపించారని, వాస్తవానికి 126 విమానాలకు సంబంధించిన హెచ్‌ఎఎల్ కాంట్రాక్ట్ట్ అప్పుడు దివాలా తీసిన అనిల్ అంబానీకి దకిందని రాహుల్ అన్నారు. అదానీకి కూడా హెచ్‌ఎఎల్ కాంట్రాక్ట్‌లు ఇచ్చారనేది నిజమని ఆయన అన్నారు. రక్షణ రంగంలో అదానీకి అనుభవం లేకున్నా నాలుగు డిఫెన్స్ కాంట్రాక్ట్‌లు ఆయనకు అప్పగించారన్నారు. అదానీ ఎన్నడూ డ్రోన్లను తయారు చేయలేదని, హెచ్‌ఎఎల్ వాటిని తయారు చేసిందన్నారు. అయినప్పటికీ మోడీ ఇజ్రాయెల్ వెళ్లివచ్చిన తర్వాత అదానీకి ఆ కాంట్రాక్ట్ దక్కిందన్నారు.

ఆర్మీని అగ్నిపథ్ బలహీనపరుస్తుంది…

అగ్నిపథ్ స్కీమ్‌నూ ఈ సందర్భంగా రాహుల్ తప్పుబట్టారు.రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) ఆలోచనలనుంచి ఈ పథకం పుట్టిందని, ఆర్మీని ఈ పథకం బలహీన పరుస్తుందని సీనియర్ అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. ఆయుధాలను ఉపయోగించడంలో వేలాది మందికి శిక్షణ ఇస్తున్నామని, నిరుద్యోగం తీవ్రంగా ఉన్న సమయంలో వారు సాధారణ పౌరులుగా సమాజంలోకి వస్తున్నారని వారు తనకు చెప్పారన్నారు.

అధికార పక్షం అభ్యంతరం

లోక్‌సభలో రాహుల్ ప్రసంగిస్తున్న సమయంలో అధికార పక్షం నుంచి పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నిరాధారమైన ఆరోపణలు చేయొద్దంటూ కదశలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు రాహుల్‌కు సూచించారు. ఆధారాలు ఉంటే చూపించాలన్నారు. తన ప్రసంగం మధ్యలో అదానీతో మోడీ సంబంధాలకు సంబంధించి వారు ఇద్దరూ కలిసి ఉన్న చిత్రాలను లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రదర్శించారు. దీనిపై స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తంచేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై మాత్రమే మాట్లాడాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News