Monday, December 23, 2024

150 మంది ఎంపీల సస్పెన్షన్‌ను పట్టించుకోరా?:రాహుల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్లమెంట్ నుంచి ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ పార్లమెంట్ మెట్లపైన మంగళవారం ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలియచేస్తున్న సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖర్‌ను అనుకరిస్తూ మిమిక్రీ చేయడంపై పెద్ద దుమారమే చెలరేగగా బిజెపి ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. కాగా..బెనర్జీ మిమిక్రీ చేస్తుండగా దాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన సెల్‌ఫోన్‌లో వీడియో షూట్ చిత్రీకరించడం కూడా వివాదాస్పదమైంది. వీడియో చిత్రీకరించడం, ఉప రాష్ట్రపతిని అవమానించారని బిజెపి ఆరోపించడంపై రాహుల్ గాంధీని విలేకరులు బుధవారం ప్రశ్నించగా ఎవరు ఎవరిని, ఎలా అవమానించారని ఆయన ఎదురు ప్రశ్నించారు. ఎంపీలు అక్కడ కూర్చుని ఉండగా తాను దాన్ని తన సెల్‌పోన్లో వీడియో తీశానని, అది తన ఫోన్‌లోనే రికార్డయి ఉందని ఆయన చెప్పారు.

ఆ దృశ్యాన్ని మీడియా నిరంతరంగా ప్రసారం చేసిందని ఆయన చెప్పారు. మీడియా వ్యాఖ్యానాలు చేసింది. ప్రధాని మోడీ వయాఖ్యానాలు చేశారు. కాని మా ఎంపీల సస్పెన్షన్‌పై ఎవరూ చర్చలు జరపరు. 150 మంది ఎంపీలను పార్లమెంట్ నుంచి గెంటేస్తే మీడియాలో చర్చ ఉండదు. అదానీపైన, రఫేల్‌పైన చర్చ ఉండదు. దర్యాప్తునకు అనుమతించడం లేదని ఫ్రాన్స్ చెప్పింది. దానిపైనా చర్చ ఉండదు. నిరుద్యోగ సమస్యపైన చర్చ ఉండదు. మా ఎంపీలు విచారంలో ఉండి అక్కడ కూర్చుంటే దానిపైన మీరు చర్చ జరుపుతున్నారు మీడియాపై రాహుల్ విరుచుకుపడ్డారు. ఎంపీల సస్పెన్షన్‌కు సంబంధించిన వార్తలను మీడియా ఎంతోకొంత చూపాలని, అది వారి బాధ్యతని రాహుల్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News