Sunday, December 22, 2024

పరువునష్టం కేసులో రాహుల్‌కు బెయిల్

- Advertisement -
- Advertisement -

ప్రధాన స్రవంతి దినపత్రికల్లో ‘పరువునష్టం కలిగించే’ ప్రకటనలు వేయించినందుకు బిజెపి కర్నాటక శాఖ దాఖలు చేసిన కేసు సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బెంగళూరులోని ఒక ప్రత్యేక కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. నిరుడు కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రచురించిన ప్రకటనల్లో రాష్ట్రంలోని అప్పటి బిజెపి ప్రభుత్వం తన 2019- 2023 పాలనలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. పరువునష్టం కేసు సందర్భంగా కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఈ నెల 1న కోర్టుకు హాజరైనప్పుడు వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 7న కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాలని రాహుల్ గాంధీని న్యాయమూర్తి కెఎన్ శివకుమార్ ఆ రోజు ఆదేశించారు. గత రెండు విచారణలకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరినందుకు రాహుల్ గాంధీ శుక్రవారం క్షమాపణ తెలియజేశారు.

కోర్టు ఆయన క్షమాపణను అంగీకరించి రూ. 75 లక్షల ష్యూరిటీతో బెయిల్ మంజూరు చేసింది. రాహుల్ గాంధీతో పాటు సిద్ధరామయ్య, శివకుమార్ కూడా కోర్టుకు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్నాటకలోని అన్ని ప్రధాన స్రవంతి దినపత్రికల్లో నిరుడు మే 5న నిందితులు ‘అవినీతి రేటు కార్డు’, ’40 శాతం కమిషన్ సర్కార్’ శీర్షిక కింద జారీ చేసిన ప్రకటనల్లో తప్పుడు, నిర్లక్షపూరిత ఆరోపణలు చేశారని నిరుడు జూన్‌లో దాఖలు చేసిన ఫిర్యాదులో బిజెపి ఆరోపించింది. కెపిసిసి అధ్యక్ష హోదాలో శివకుమార్, శాసనసభలో అప్పటి ప్రతిపక్ష నాయకుని హోదాలో సిద్దరామయ్య ద్వారా కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) ఆ ప్రకటనలు జారీ చేసిందని బిజెపి తన ఫిర్యాదులో ఆరోపించింది. రాహుల్ గాంధీ ఆ ‘పరువునష్టం కలిగించే ప్రకటన’ను తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ పోస్ట్‌లో పొందుపరిచారని బిజెపి పేర్కొన్నది.

రాహుల్ గాంధీ స్వయంగా కోర్టు ముందు హాజరైన తరువాత బిజెపి ‘ఎక్స్’ పోస్ట్‌లో వ్యాఖ్యానిస్తూ, ‘నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్‌పై విడుదలైన నిందితుడు రాహుల్ గాంధీ ! నమ్మ బెంగళూరుకు మీకు స్వాగతం. కర్నాటకలోని మా నేతలపై మీరు ఉపయోగించిన, ఇప్పటి వరకు మీరు రుజువు చేయలేకపోయిన తప్పుదారి పట్టించే, పరువునష్టం పూర్వక ప్రకటనలకు సంబంధించి భారతీయ చట్టాల పరిణామాలను అనుభవించేందుకు మీకు స్వాగతం పలుకుతున్నాం’ అని పేర్కొన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News