కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా ఓ క్రిమినల్ : రాహుల్
రాజీనామా చేయాలని విపక్షాల పట్టు
కొడుకు చేసిన తప్పుకు తండ్రిని ఎలా శిక్షిస్తారు
అజయ్‌మిశ్రాపై చర్యలుండవు : బిజెపి వర్గాలు
న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరీ ఘటనపై గురువారం పార్లమెంటు దద్దరిల్లింది. దీంతో ఉభయ సభలు ఎలాంటి కార్యకాలాపాలు నిర్వహించకుండానే వాయిదా పడ్డాయి. ప్రణాళిక ప్రకారమే ఈ ఘటనకు పాల్పడినటు ్లప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్) ఇటీవల సంచలన విషయాలు వెల్లడించిన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాను తక్షణమే పదవినుంచి తొలగించాలని విపక్ష సభ్యులు లోక్‌సభలో ఆదోళనకు దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ మాట్లాడుతూ అజయ్ మిశ్రాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయనో క్రిమినల్ అని, వెంటనే మంత్రిపదవినుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమయినప్పటినుంచే గొడవ ప్రారంభమైంది. ఎంఎస్‌ఎంఇలపై ప్రశ్న అడిగిన రాహుల్ గాంధీని మాట్లాడాలని స్పీకర్ ఓం బిర్లా కోరడంతో గొడవ మొదలైంది. రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘లఖింపూర్ ఖేరీ ఘటన ఓ కుట్ర అని తేలింది.
ఈ ఘటనకు ఎవరి కుమారుడు బాధ్యుడో అందరికీ తెలుసు.ఆ మంత్రి( అజయ్ మిశ్రా) రాజీనామా చేయాలని కోరుతున్నాను. దీనిపై పార్లమెంటులో చర్చ జరగాలి. అయితే ప్రధాని అందుకు అంగీకరించడం లేదు. రైతుల హత్యకు కారణమైన ఆ మంత్రి ఓ క్రిమినల్. ఆయన రాజీనామా చేయాలి, ఆయనను కఠినంగా శిక్షించాలి’ అని రాహుల్ డిమాండ్ చేశారు. ప్రశ్నకు పరిమితం కావాలని స్పీకర్ రాహుల్‌కు సూచించారు. అయితే విపక్ష సభ్యులు ఒక్కసారిగా వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ రాహుల్ గాంధీ ఈ అంశంపై ఇచ్చిన వాయిదాతీర్మానంపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేయసాగారు.
కాంగ్రెస్ సభ్యులు వెల్‌లో ఉన్న సమయంలో రాహుల్ మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారని, దీన్ని అనుమతించకూడదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ అభ్యంతరం చెప్పారు. రాహుల్ గాంధీ మాట్లాడడం కొనసాగించడంతో బిజెపి సభ్యులు కూడా లేచి అభ్యంతరం చెబుతూ గొడవ చేయడం సాగారు. తమ స్థానాల్లోకి వెళ్లాలంటూ స్పీకర్ పదేపదే కోరినప్పటికీ విపక్ష సభ్యులు పట్టించుకోకుండా గొడవ చేయడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2 గంటల తర్వాత సభ తిరిగి ప్రారంభమైనప్పుడు కూడా విపక్ష సభ్యులు మిశ్రాపై చర్యకు డిమాండ్ చేస్తూ విపక్ష సభులు ్ల వెల్‌లోకి దూసుకెళ్లి గొడవ కొనసాగించారు. దీంతో స్పీకర్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
రాజ్యసభ కూడా..
అటు రాజ్యసభలో కూడా ఇదే గందరగోళం నెలకొంది. లఖింపూర్ ఖేరి ఘటనతో పాటు 12 మంది విపక్ష ఎంపిల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులుగొడవ చేయడంతో చైర్మన్ వెంకయ్యా నాయుడు తొలుత సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. 2 గంటల తర్వాత సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా విపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. ఒమిక్రాన్ కారణంగా తలెత్తిన పరిస్థితిపై స్వల్పకాలిక చర్చకు అనుమతించాలని డిప్యూటీ చైర్మన్ విజ్ఞప్తి చేసినా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. గొడవ మధ్యలోనే చర్చను ప్రారంభించాలని డిప్యూటీ చైర్మన్ బిజెపి సభ్యుడు సయ్యద్ జాఫర్ ఇస్లాంను కోరడంతో ఆయన మాట్లాడడం మొదలు పెట్టారు. దీంతో విపక్ష సభ్యులు మరింత గొంతు పెంచి నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో డిప్యూటీ చైర్మన్ సభను రేపటికి వాయిదా వేశారు.
కొడుకు తప్పులకు తండ్రిని శిక్షించడం సరికాదు
లఖింపూర్ ఖేరీ సంఘటన: మంత్రి అజయ్ మిశ్రాకు బిజెపి మద్దతు
న్యూఢిల్లీ : కొడుకు చేసిన తప్పులకు తండ్రిని శిక్షించడం సరికాదని లఖింపూర్ ఖేర్ సంఘటన విషయంలో బిజెపి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. లఖింపూర్ ఖేర్ ఘటన ప్రణాళిక ప్రకా రం జరిగిన కుట్రే అని సిట్ నివేదిక రావడంతో కేంద్రమంత్రి పదవి నుంచి అజయ్ మిశ్రాను వెం టనే తొలగించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ ఘటనలో ఆయన పాత్రపై దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ తాజాగా డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో బిజెపి సీనియర్ నేతలు మిశ్రాపై చర్య తీసుకోడానికి అనుకూలంగా లేనట్టు మీడియా కథనాలు చెబుతున్నాయి. లఖింపూర్ కేసు ఇంకా కోర్టు విచారణలో ఉందని, సిట్ కూడా తుది నివేదిక సమర్పించాల్సి ఉందని బిజెపి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జర్నలిస్టులపై మిశ్రా దు ర్భాషలాడడం, చిందులు వేయడం తప్పేనని బిజెపి ఒప్పుకొంటోంది. మిశ్రా నేరస్తుడని వెం టనే పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా డిమాండ్ చేసినప్పటికీ మంత్రి తన పదవికి రాజీనామా చేయడానికి సుముఖంగా లేనట్టు తెలుస్తోంది.