Sunday, January 12, 2025

సమ పంపిణీ లేని సంపదతో ఆ కొందరికే ఫాయిదా: రాహుల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుతోంది. కానీ ఇది సమతూకంలో అందరికి పంపిణీ కావడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. పెరిగే సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం అవుతోంది. దీనితో దేశంలో నిరుద్యోగం అంతులేకుండా పోతోందని , ఇది పెనుసవాలు అయిందని రాహుల్ అభిప్రాయపడ్డారు. హార్వర్డ్ యూనివర్శిటీ విద్యార్థులతో ఇష్టాగోష్టి సందర్భంగా రాహుల్ దేశ ఆర్థిక పరిస్థితి, అవకతవకల గురించి విశ్లేషించారు. ఈ నెల 15వ తేదీన విద్యార్థులతో తాను ముచ్చటించినప్పటి వీడియో రికార్డును రాహుల్ శనివారం ఎక్స్ సామాజిక మాధ్యమంలో పొందుపర్చారు. ఎంత సంపద పెరిగితే ఏం? అది అందరికి సమానంగా అందాలి కదా? అని ఆయన ప్రశ్నించారు. తాను యువతకు ఒక్కటే సలహా ఇస్తున్నానని, ఎప్పుడూ ప్రజలతో మమేకం అయి ఉండండి,

అప్పుడే వాస్తవిక అధికారం సిద్ధిస్తుంది. ప్రజలు చెప్పేది శ్రద్ధగా ఆలకించాలి. వారి పట్ల సహృదయతను చాటాలని సూచించారు. దేశ ఆర్థిక ప్రగతి గురించి ప్రస్తావన వస్తోంది. దీని గురించి మాట్లాడేటప్పుడు ముందుగా మనం ఈ ఆర్థిక ప్రగతి ఎవరికి చెందుతోంది? ఎవరి ప్రయోజనాల దిశలో ఈ ప్రగతి దారిమళ్లుతోందనేది ఆలోచించుకోవల్సి ఉందని రాహుల్ స్పష్టం చేశారు. ఆర్థిక ప్రగతి ఉందని ఓ వైపు చూపుతున్నారు. సంబంధిత గ్రాఫ్‌లు చూపుతున్నారు. మరి దీనికి మరో వైపుగా ఎదిగిపోతున్న నిరుద్యోగ సూచీ విషయంలో మన ఆలోచనలు సాగాల్సి ఉంటుంది. దేశ ప్రగతి కేవలం కొందరి చేతుల్లోకి వెళ్లుతూ ఉంటే, ఇక కన్పించే ప్రగతిని ఏమనుకోవల్సి ఉంటుందని రాహుల్ ప్రశ్నించారు.

అప్పుల పై తప్పితే ఉత్పత్తిపై దృష్టి లేదు
ఇప్పుడు మన వ్యవస్థల నిర్వహణ అంతా కూడా ఎంత మేరకు రుణాలు తీసుకువస్తున్నాం అనే విషయంపైనే ఆధారపడి ఉంటోంది. అంతేకానీ ఉత్పాదకత గురించి ఎటువంటి నిర్మాణాత్మక చర్యలు లేకుండా పోతున్నాయి. ఉత్పత్తి ఆధారిత ఆర్థిక వ్యవస్థ అవసరం ఉంది. లేకపోతే మనకు మిగిలేది అప్పుల చక్రబంధపు ఆర్థిక వ్యవస్థనే అని రాహుల్ తెలిపారు. ఫ్యాక్టరీల ఏర్పాటు ద్వారా సాధించుకునే ఉత్పత్తితోనే నిర్మాణాత్మక అభివృద్ధి జరుగుతుంది. దీని వల్లనే ఉపాధి ఉద్యోగావకాశాలు ఏర్పడుతాయి. యువత దేశ ఆర్థిక వ్యవస్థలో తాను సైతం అంటూ భాగస్వామ్యం వహిస్తుంది. పనికి దిగి, తగు ఫలితం పొందుతుందన్నారు. ఒక్కరిద్దరు వ్యాపారవేత్తల కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ కేవలం వారికే లాభించే అంశం అవుతోందని విమర్శించారు.

అదానీ మోడీ కనెక్షన్ అందరికీ తెలిసిందే
ప్రముఖంగా విన్పించే వ్యక్తి అదానీ , ఆయనకు ప్రధాని మోడీకి లింకులు ఉన్నాయని అందరికీ తెలిసిందే. నేరుగా పిఎంతో కనెక్షన్ ఉంది. దేశంలోని అన్ని రేవులు, విమానాశ్రయాలు, మన మౌలిక నిర్మాణ వ్యవస్థ అంతా ఆయన ఆధీనంలో ఉంది. దీనితో జరిగే ప్రగతి కేవలం ఏక వ్యక్తి లేదా ఏకైక సంస్థల కేంద్రీకృతం అయి, అనివార్యపు వికేంద్రీకరణకు గండిపడుతోందని రాహుల్ తెలిపారు.

ఎన్నికలను ఢీకొనేందుకు తగు మౌలిక సాధనాసంపత్తి అవసరం
మోడీ అదానీ అనుబంధం,దీనితో తలెత్తే అవలక్షణాల గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లుతున్నా, అందుకు అనుగుణంగా సరైన రీతిలో ఎన్నికల్లో సత్ఫలితాలను తాము సాధించుకోలేకపోతున్నామని రాహుల్ అంగీకరించారు. ప్రజా సమీకరణ బాగా ఉంటోంది. అయితే ఎన్నికలు, బ్యాలెట్ ద్వారా జన స్పందనను క్రోడీకరించుకోవడంలో విఫలం అవుతున్నాం. మొత్తం మీద ఎన్నికల పోరులో తగు మౌలిక సాధనాసంపత్తిని సంతరించుకోవల్సి ఉంటుందని వివరించారు. నిజాయితీ మీడియా అవసరం
దేశంలో ఇప్పుడు అత్యవసరం స్వచ్ఛమైన మీడియా. సముచిత న్యాయ వ్యవస్థ. న్యాయంగా వ్యవహరించే ఎన్నికల సంఘం. ఆర్థిక వ్యవస్థలకు అనుసంధానం కాగలిగే పరిస్థితి. అమెరికాలో ఐఆర్‌ఎస్, ఎఫ్‌బిఐ ఇతర సంస్థల పూర్తి బాధ్యత ఏదో విధంగా ప్రతిపక్షాలను దెబ్బతీయడం అని, దీనికి ఇప్పుడు ఇక్కడి వాతావరణానికి పోలిక ఉందన్నారు.

తాను దేశంలో 4000 కిలోమీటర్ల మేర పాదయాత్ర జరిపింది, కేవలం తాను నడకను కోరుకుంటున్నానని కాదని , ఈ పాదయాత్రతోనే దేశ వ్యాప్తంగా ప్రజల వద్దకు తగు సందేశం వెళ్లగల్గుతుందనే నమ్మకంతోనే అన్నారు. తన సోషల్ మీడియాపై కూడా ఆంక్షలు ఉన్నాయి. ఎల్లవేళలా దీనిపై నిఘా నీడలు పర్చుకుంటున్నాయి. యూట్యూబ్‌పై కూడా కంట్రోలు సాగుతోంది. తానొక్కడే కాదు. ప్రతిపక్షం అంతా ఈ నిఘాలతో వేగాల్సి వస్తోంది. మొత్తం మీద దేశంలో సజావైన ప్రజాస్వామ్యం లేనే లేదని రాహుల్ తెలిపారు. దేశంలో కులవ్యవస్థ అత్యంత కీలకమైన సమస్య, ఇది ఉధృత స్థాయి వివక్షతలకు దారితీస్తోందని రాహుల్ మండిపడ్డారు.

సమాఖ్యవాదం ఖతం మణిపూర్‌లో అంతర్యుద్ధం
బిజెపి సారధ్య కేంద్రప్రభుత్వం ఈ దేశాన్ని సమాఖ్య వాదపు రాష్ట్రాలతో కూడిన యూనియన్‌గా భావించడం లేదని , దీనికి భిన్నంగా ఒక సిద్ధాంతం, ఒక మతం, ఒక భాష ప్రాతిపదికన పాలిస్తోందన్నారు. ఈ క్రమంలో వారు చర్చల ప్రక్రియను ఖూనీ చేస్తారు. వ్యవస్థలను గుప్పిట్లోకి తెచ్చుకుంటారు.ఈ క్రమంలో ఇప్పుడు దేశంలో రాజకీయ పోరు సాగుతోందన్నారు. మణిపూర్ మండుతోంది. జమ్మూ కశ్మీర్ రగులుతోంది. తమిళనాడులో భాషపరమైన సమస్య ఉందని రాహుల్ గుర్తు చేశారు. నిజానికి మణిపూర్‌లో ఇప్పుడు సాగుతున్నది కేవలం పూర్తిస్థాయి అంతర్యుద్ధం అని ఆందోళన వ్యక్తం చేశారు.

భారతదేశం అమెరికాతో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ దీని వల్ల ఇతర దేశాలతో మంచిగా ఉండరాదనేది లేదని రాహుల్ తెలిపారు. తను గుర్తించిన దాని ప్రకారం ఇప్పుడు నిజమైన రాజకీయవేత్త ఎప్పుడో మరణించాడు. ఇండియాలోనే కాకుండా అంతటా ఈ పరిణామం ఉంది. ఇప్పుడు రాజకీయులు కేవలం తనకంటూ ఏర్పర్చుకున్న ప్రత్యేక జోన్‌లోకి వెళ్లారు. వీరు ప్రజలతో మాట్లాడటం జరగడం లేదు. వారిని ఎప్పటికప్పుడు ఏదో విధంగా తమకు అనుకూలంగా మల్చుకోవడమే వీరి పరమావధి అయింది. ఈ క్రమంలోనే అన్ని రకాల అవలక్షణాలు ఏర్పడుతున్నాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News