తెలంగాణ పోరాటంపై అవగాహనలేని నాయకుడు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలను నిండా ముంచుతుంది
కర్నాటకలో అడ్డగోలు హామీలిచ్చి, అధికారం రాగానే మాట మార్చింది: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
మన తెలంగాణ/ హైదరాబాద్: దేశంలో కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా బిజెపి పోరాటం చేస్తుందని కేంద్ర మంత్రి, బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ పోరాటం చర్రిత గురించి తెలియని ఆజ్ఞాని రాహుల్ గాంధీ బిజెపి, బిఆర్‌ఎస్ ఒకటేనంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తమ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం ఆయన అనుచరులు, సర్పంచ్‌లు,మాజీ సర్పంచ్, ఎంపీటీసీలతో పాటు సుమారు 60 మంది ప్రజాప్రతినిధులు బిజెపిలో చేరారు.
ఈసందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రాహుల్‌కు తెలంగాణ పోరాటం, ప్రజల ఆకాంక్షలపై ఎటువంటి అవగాహన లేదని మండిపడ్డారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ఆధారంగా బిజెపికి వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇస్తున్నాడన్నారు. కొన్ని ప్రచార సాధనాలు కావాలని బిజెపిపై వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో రిమోట్ కంట్రోల్ గవర్నెన్స్ నడిపించిన ఘనత రాహుల్ గాందీదేనని అమ్ముడు పోయే పార్టీ కాంగ్రెస్ 2018లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు అమ్ముడుపోయారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీని దారుస్సలాం నుంచి అసదుద్దీన్ ఓవైసీ నడిపిస్తున్నాడని రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి తెలంగాణ నుంచి ప్రచారం చేసింది ఎవరో మీకు తెలియదంటూ నిలదీశారు. మా గొంతులో ప్రాణమున్నంత వరకు బిజెపి మజ్లిస్ పార్టీతో జత కట్టమని,దేశం కోసం పనిచేసే పార్టీ బిజెపి ఒకటేనని మాకు అధికారం శాశ్వతం కాదు సిద్ధాంతాలు ముఖ్యమని తెలిపారు. బిజెపి ప్రజల టీమ్ తప్ప ఏ పార్టీకి టీమ్ కాదన్నారు.
రూ. 1.20 లక్షల కోట్లతో తెలంగాణలో జాతీయ రహదారులను ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం నిర్మించిందని, కరోనా ఆపత్కాలంలో రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్ అందించిన ఘనత మోదీ ప్రభుత్వకే దక్కుతుందన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలంటేనే శత్రు దేశాలు వణికిపోతాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దిల్ సుఖ్ నగర్, లుంబినీ పార్కులో బాంబు పేలుళ్లు అనేక చోట్ల అరెస్టులు జరిగాయని, ఉగ్రదాడులు మితిమీరిపోవడంతో కూకటివేళ్లతో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను బిజెపి ప్రభుత్వం అణచివేసిందన్నారు.మజ్లిస్ పార్టీని పెంచి పోషించి, వాళ్ల మోచేతి నీళ్లు తాగింది కాంగ్రెస్ పార్టీ. మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్ నాయకులు వంగివంగి సలాం చేసేవాళ్లని నాడు మజ్లిస్ దయాదాక్ష్యిణ్యాలు ఉంటేనే కాంగ్రెస్ మంత్రులు పాతబస్తీలో పర్యటించేవారని ఎద్దేవా చేశారు.యూపీఏ హయాంలో రూ. 12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆ పార్టీ నాయకులకు ప్రజలను ఓట్లు అడిగే అర్హత లేదని,1969 తెలంగాణ ఉద్యమంలో 369 విద్యార్థులను తుపాకులతో కాల్చి చంపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుందని విమర్శించారు.మలిదశ ఉద్యమంలోనూ 1200 మంది బిడ్డలను బలగొని, కుటుంబాలను చిన్నాభిన్నం చేసిందని మండిపడ్డారు.
ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని తాము అధికారంలోకి వస్తే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నీతివంతమైన పాలన అందిస్తుందన్నారు. విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తామని, రైతులకు అన్ని రకాల పంటలకు బీమా పథకం అందించి ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కర్ణాటకలో రైతుల పంటలకు కనీసం 5 గంటల కరెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులకు గురిచేస్తుందని మహిళలు, విద్యార్థులకు అనేక రకాల హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నిండా మోసం చేసిందన్నారు.