Monday, December 23, 2024

అధికార కేంద్రంలో పుట్టినా.. అధికారంమీద ఆసక్తి లేదు

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi makes key remarks that he was not interested in power

సిఎం పదవి ఆఫర్ చేసినా మాయావతి స్పందించలేదు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ఇతర రాజకీయ నాయకుల మాదిరితనకు అధికారంపై ఆసక్తి లేదంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని అర్థం చేసుకోవడంపైనే తాను ఎక్కువ దృష్టి పెట్టానని చెప్పారు. అలాగే బిఎస్‌పితో పొత్తు గురించి ప్రస్తావించారు. శనివారం ఢిల్లీలో‘ద దళిత్ ట్రూత్: ద బ్యాటిల్స్ ఫర్ రియలైజింగ్ అంబేద్కర్ విజన్’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాహుల్ తాజా వ్యాఖ్యలు చేశారు. రాహుల్ సన్నిహితుడు కె. రాజు ఈ పుస్తకాన్ని రచించగా సమృద్ధ భారత్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్నినిర్వహించింది. ఈ సందర్భంగా రాహుల్ పలు అంశాలను ప్రస్తావించారు. ‘ రాజకీయ నాయకులు అధికారం పొందేందుకు ప్రయత్నిస్తారు.

వారు దానిగురించే ఆలోచిస్తారు. ఉదయాన్నే లేచి అధికారం ఎలా సంపాదించాలని ఆలోచిస్తారు. అదే ఆలోచనతో నిద్రకు ఉపక్రమిస్తారు. ఈ దేశం మొత్తం అలాంటి నేతలే ఉన్నారు. అధికారానికి కేంద్రమైన కుటుంబంలో పుట్టాను. నిజం చెప్పాలంటే నాకు అధికారం మీద ఆసక్తి లేదు. దానికి బదులు దేశాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రేమించడానికి ప్రయత్నిస్తున్నాను. ఒక ప్రేమికుడు తాను ప్రేమించే వ్యక్తిగురించి తెలుసుకోవాలనుకున్నట్లుగా నేను ఈ దేశాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. ఈ దేశం నాకు ఎంతో ప్రేమను పంచింది. ఇక్కడ ద్వేషాన్నీ చవి చేశాను.కానీ నాకు తగిలే ప్రతి గాయం ఏదో ఒకటి నేర్పిస్తుంది’ అంటూ తన మనసులోని మాటలను బైటపెట్టారు.

సిఎం పదవి ఆఫర్ చేసినా..స్పందించలేదు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి సారథ్యంలోని బిఎస్‌పితో పొత్తు పెట్టుకుని .. ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు కాంగ్రెస్‌పార్టీ ఆఫర్ ఇచ్చిందని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ తెలిపారు. అయితే ఈ ఆఫర్‌కు మాయావతి ఏమాత్రం స్పందించలేదని ఆయన చెప్పారు. కేంద్ర ఏజన్సీల ఒత్తిడే అందుకు కారణం కావచ్చని రాహుల్ అన్నారు. సంస్థలకు స్వేచ్ఛ ఇవ్వకుంటే రాజ్యాంగానికి అర్థం లేదని, బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగమనే ఆయుధాన్ని మనకు ఇచ్చినప్పటికీ ప్రస్తుతం ఆ ఆయుధానికి అర్థం లేకుండా పోతోందన్నారు. పెగాసస్ ద్వారా రాజకీయవేత్తలను కంట్రోల్ చేయడం, మీడియాను కంట్రోల్ చేయడం, ముగ్గురు, నలుగురు పారిశ్రామికవేత్తలకోసం పని చేయడం జరుగుతోందని విమర్శించారు. గాంధీజీ, అంబేద్కర్ సూచించినమార్గంలోనే మనమంతా పయనించాలని,అదంత సులభంకానప్పటికీ ఆ మార్గాన్నేఅనుసరించాలని సూచించారు. ‘కొందరు రాజకీయవేత్తలున్నారు. మీరు చూసే ఉండొచ్చు.

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మాయావతి ఏమాత్రం పోరాటం చేయలేదు. పొత్తుపెట్టుకుందాం, మీరే ముఖ్యమంత్రిగా ఉండండి అంటూ మేము సందేశం పంపాం. ఆమె స్పందించలేదు. కాన్షీరామ్ వంటి నేతలంటే మాకు గౌరవం. యుపిలో దళితుల సాధికారత కోసం వారంతా అహరహం శ్రమించారు. కాంగ్రెస్ కూడా ఆ సమయంలో నష్టపోయింది. కానీ మాయావతి మాత్రం ఇందుకు భిన్నం. నేను వారి కోసం పోరాడనని బహిరంగంగానే చెప్పేశారు. ఎందుకు? సిబిఐ, ఇడి, పెగాసస్ వల్లే’ అని రాహుల్ అన్నారు. బిజెపితో అవగాహనవల్లే అసెంబ్లీ ఎన్నికల్లో తగినంత ప్రచారం కానీ, పొతుత్లు పెట్టుకోవడం కానీ మాయావతి చేయలేదంటూ ఎన్నికల ఫలితాల అనంతరం పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.అయితే ఈ ఆరోపణలను మాయావతి కొట్టిపారేశారు. యుపి అసెంబ్లీ ఎన్నికల్లో బిఎస్‌పి కేవలం ఒక్క సీటుగెలుచుకుంది.గతంలో 22 శాతంగా ఉన్న ఆ పార్టీ ఓటింగ్ షేరు 2022 ఎన్నికల్లో 12.8శాతానికి పడిపోయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News