Sunday, January 12, 2025

స్పీకర్ బిర్లాతో రాహుల్ భేటీ

- Advertisement -
- Advertisement -

లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం స్పీకర్ ఓమ్ బిర్లాతో సమావేశమై, తనపై బిజెపి ఎంపిలు చేసిన వ్యాఖ్యలను తొలగించాలని, సభ సాఫీగా పని చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అదానీ వివాదంపై నుంచి దృష్టి ‘మళ్లించేందుకు’ తనపై బిజెపి ‘నిరాధార’ ఆరోపణలు చేస్తోందని రాహుల్ ఆక్షేపించారు. అయితే, ఆ ఆరోపణల్లో దేనిపైనా తాను రెచ్చిపోనని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ వెలుపల విలేకరులతో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, శుక్రవారం (13న) రాజ్యాంగంపై లోక్‌సభలో ప్రారంభం కానున్న చర్చను తాను, తన పార్టీ కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ బాధ్యత కానప్పటికీ సభ సక్రమంగా పని చేసేలా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. ‘నేను స్పీకర్‌తో భేటీ అయ్యాను. నాపై వచ్చిన పరువునష్టం కలిగించే వ్యాఖ్యలను తొలగించాలని మా పార్టీ కోరుకుంటున్నదని ఆయనతో చెప్పాను. తాను వాటిని పరిశీలిస్తానని స్పీకర్ చెప్పారు. వారు (బిజెపి) అన్ని రకాల నిరాధార ఆరోపణలు చేస్తూనే ఉన్నారు, కానీ సభ పని చేయాలని మేము నిశ్చయించాం.

వారు ఏవిధంగా రెచ్చగొట్టినా వారిని అనుమతిస్తాం. కానీ మేము సభ నడిచేలా ప్రయత్నిస్తాం. సభ ఏదో విధంగా పని చేయాలని మేము కోరుకుంటాం. చర్చ జరగాలని మేము వాంఛిస్తున్నాం. శుక్రవారం(13న) రాజ్యాంగంపై చర్చ జరగాలని మేము కోరుకుంటున్నాం’ అని రాహుల్ తెలియజేశారు. బిజెపి ఎంపిలు ‘నాపై ఏ అంశంపైనైనా మాట్లాడవచ్చు, కానీ రాజ్యాంగంపై చర్చ జరగాలి’ అని ఆయన అన్నారు. ‘అది చాలా తేలిక, వారు అదానీ సమస్యపై చర్చ కోరుకోవడం లేదు, అదానీ సమస్యపై నుంచి దృష్టి మళ్లించాలని అనుకుంటున్నారు. మీకు తెలుసు, వారిని చివరి వరకు మేము వదలం’ అని రాహుల్ చెప్పారు. రాహుల్ గాంధీపై బిజెపి ఎంపి నిశికాంత్ దుబే చేసిన ‘పరువునష్టం కలిగించే వ్యాఖ్యల’పై పార్టీ ఫిర్యాదును పరిశీలించి, రికార్డుల్లో నుంచి తొలగించవలసిందిగా కోరుతూ స్పీకర్‌కు లోక్‌సభలోని కాంగ్రెస్ ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ అంతకు ముందు బుధవారం లేఖ రాశారు.

స్పీకర్ నిర్ణయం తరువాత ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల కోసం నిశ్చయించిన సభా కార్యకలాపాల్లో పాల్గొనాలన్న ఆసక్తితో కాంగ్రెస్ ఉందని గొగోయ్ తెలిపారు. ఇది ఇలా ఉండగా, కాంగ్రెస్ అధిష్ఠానం, యుఎస్ బిలియనీర్ మదుపరి జార్జి సోరోస్ మధ్య సంబంధాలు ఉన్నాయని బిజెపి ఆరోపిస్తుండడం గురించి విలేకరులు ప్రశ్నించినప్పుడు రాహుల్ సమాధానం ఇస్తూ, ‘వారు ఆరోపణలు చేస్తూనే ఉంటారు, కానీ వారు ఏ ఆరోపణలు చేసినా మేము సభ పని చేయాలని కోరుకుంటాం. వారు నాపై ఎటువంటి ఆరోపణలు చేస్తున్నా వారి చేయనివ్వండి’ అని అన్నారు. రాహుల్ గాంధీ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కూడా కలుసుకుని జాతీయ పతాకం అందజేయాలని కోరుకున్నారు, కానీ పరస్పర అభినందనల తరువాత రాజ్‌నాథ్ సింగ్ ముందుకు సాగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News