మన తెలంగాణ/హైదరాబాద్: వరంగల్ హనుమకొండలోని ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ హన్మంతరావు సోమవారం పరిశీలించారు. అనేక ఉద్యమాలు ఓరుగల్లు నుండే పురుడుపోసుకున్నాయన్నారు. మే 6వ తేదీన జరిగే సభ.. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకునే సభ అని అన్నారు ప్రజలంతా టిఆర్‌ఎస్ పాలనపై అసహనంతో వున్నారని తెలిపారు. వరంగల్ లో జరిగే రైతు సంఘర్షణ సభతో రాజకీయ మార్పు సంభవిస్తుందన్నారు.
ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు తిప్పుకోవడం కోసం కార్యాచరణ మొద లైందని వెల్లడించారు. ఆరు లక్షల మందితో రైతు సంఘర్షణ సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆర్ట్ కాలేజీ సభ శుభ సూచికమన్నారు. తమలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు. ఉపరాష్ట్రపతి ప్రకటన ఆమోద యోగ్యమని తెలిపారు. ఒక పార్టీ నుండి గెలిచి మరో పార్టీలోకి మారితే పదవికి రాజీనామా చేయాలనే నిర్ణయంపై పార్లమెంట్‌లో చట్టం తేవాలన్నారు. బిజెపి, టిఆర్‌ఎస్ మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు. బిజెపి కేవలం మాటల ప్రభుత్వమేనన్నారు. ధరలు పెంచి రోడ్లపై ధర్నాలు చేస్తున్నారని.. ఇదెక్కడి న్యాయం? అని ప్రశ్నించారు. అంతర్జాతీయ మార్కెట్‌తో సంబంధం లేకుండా ప్రజలపై భారం పడకుండా చూడాలన్నారు.