లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అంశాన్ని ప్రస్తావిస్తుండగా మైక్‌ను కట్ చేశారని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఆరోపించింది. మైక్రోఫోన్‌లో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ ఓం బిర్లాను రాహుల్ గాంధీ అభ్యర్థిస్తున్న వీడియోను కాంగ్రెస్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో షేర్ చేసింది. నీట్ వివాదంపై శుక్రవారం లోక్‌సభలో చర్చను కోరిన రాహుల్ గాంధీ ప్రభుత్వం నుంచి దీనిపై ఒక ప్రకటనను డిమాండ్ చేశారు. ఈ సమయంలో రాహుల్ మైక్ మూగబోయింది.
దీనిపై స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ ఎంపీల మైక్ లను తాను స్విచాఫ్ చేయబోనని, దాని కంట్రోల్ తన వద్ద ఉండదని వివరణ ఇచ్చారు. రాష్ట్రపతి ప్రసంగంపైనే చర్చ ఉండాలని, ఇతర అంశాలు సభలో రికార్డు కావని ఆయన స్పష్టం చేశారు. కాగా..నీట్‌పై ప్రధాని నరేంద్ర మోడీ ఏమీ మాట్లాడరని, మాట్లాడేందుకు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తే ఆయన మైక్ స్విచాఫ్ అవుతుందని, ఇవి యువత గొంతు సభలో వినిపించకుండా చవకబారు ఎత్తుగడలని కాంగ్రెస్ తన ట్వీట్‌లో విమర్శించింది.