Sunday, December 22, 2024

మాకు నితీశ్ అవసరం లేదు: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

పూర్ణియా: బీహార్‌లో సామాజిక న్యాయం కోసం మహాఘట్‌బంధన్ పోరాడుతుందని, ఇందుకు తమకు నితీశ్ కుమార్ అవసరం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర బీహార్‌లో రెండో రోజు మంగళవారం పూర్ణియా జిల్లాలో ప్రవేశించింది.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడిన రాహుల్ గాంధీ నితీశ్ కుమార్ ఇండియా కూటమిని వదిలిపెట్టి తిరిగి ఎన్‌డిఎలో చేరి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడంపై తొలిసారి స్పందించారు. బిజెపి ఒత్తిడితోనే నితీశ్ యూటర్న్ తీసుకుని ఎన్‌డిఎ కూటమికి చేరువయ్యారని అన్నారు. బిజెపికి కులగణన భయం పట్టుకుందన్నారు. బీహార్‌లో కులగణన చేపట్టాలని స్వయంగా తాను నితీశ్‌ను కోరానని, తమతో పాటుగా ఆర్‌జెడి కూడా సర్వేకు పట్టుబట్టిందన్నారు. కులగణనకు భయపడిన బిజెపి ఈ ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ నితీశ్‌కు వల వేసిందని, దొడ్డిదారిన పారిపోయేందుకు ఆయనకు పాచిక విసిరిందని అన్నారు. ప్రజలకు సామాజిక న్యాయం కల్పించడం తమ కూటమి బాధ్యతని, దీనికోసం తమకు నితీశ్ అవసరం ఎంతమాత్రం లేదని రాహుల్ స్పష్టం చేశారు.

మోడీ పాలనలో సామాజిక న్యాయం లేదన్నారు రాహుల్. దేశంలో చాలా చోట్ల ప్రజలు పస్తులుంటున్నారన్నారు.ఏ రంగంలో చూసినా దళితులు, గిరిజనులకు న్యాయం జరగడం లేదన్నారు. సామాజిక, ఆర్థిక న్యాయంనుంచి దృష్టిమరల్చేందుకు బిజెపి విద్వేషం, హింసను ప్రేరేపిస్తోందని దుయ్యబట్టారు. దళితులు, ఒబిసిలు, గిరిజనుల కచ్చితమైన జనాభాను నిర్ధారించడానికి దేశానికి కులగణన ఎంతో అవసరమని రాహుల్ అన్నారు. నితీశ్ కుమార్ తరచూ ఎన్‌డిఎ, మహా కూటమి మధ్య దోబూచులాడడాన్ని రాహుల్ ప్రస్తావిస్తూ, ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి సిఎంగా ప్రమాణ స్వీకారం చేసి తిరిగి వస్తూ, తనశాలువా రాజ్‌భవన్‌లో మరిచిపోయానని గుర్తుకు వచ్చి తిరిగి రాజ్‌భవన్ వెళ్తారని, ఇంత త్వరగా రాజ్‌భవన్‌కు తిరిగి వచ్చారేమిటని గవర్నర్ ప్రశ్నిస్తారని ఎద్దేవా చేశారు. మణిపూర్‌లో అంతర్యుద్ధం తరహా వాతావరణం ఉందని ఆయన అంటూ అయినా ప్రధాని నరేంద్ర మోడీ ఇంతవరకు ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదని అన్నారు.

ఎఐసిసి అధ్యక్షుడు మల్లికారున ఖర్గే కూడా ఈ ర్యాలీలో ప్రసంగించాల్సి ఉంది కానీ, వాతావరణం సరిగా లేకపోవడంతో ఆయన విమానం విమానాశ్రయంలో దిగలేకపోయిందని బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు అణిలేశ్ ప్రసాద్ చెప్పారు. అయితే ఖర్గే వర్చువల్‌గా సభనుద్దేశించి ప్రసంగించారు. చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్, సిసిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య కూడా ఈ సభలో మాట్లాడారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News