కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నికలపై రాహుల్ గాంధీ తొలి స్పందన
బెంగళూరు : కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికలపై ఆ పార్టీనేత మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు. పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు గాంధీ కుటుంబం కనుసన్నల్లోనే నడిచేవారేనంటూ వస్తున్న ఆరోపణలను నిర్దంద్వంగా కొట్టివేశారు. “ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. ఈ దశలో నా అభిప్రాయం చెప్పడం సరికాదు. పోటీలో ఉన్న ఇద్దరూ మంచి ప్రతిభావంతులు, గాంధీ కుటుంబ అనుయాయులు అని మాట్లాడటం మాత్రం సరికాదు ” అని రాహుల్ శనివారం నాడిక్కడ మీడియాతో అన్నారు. ఇలాంటి ఆరోపణలు చేయడం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులను అవమానించడమే అవుతుందని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో తొలిసారి ఆయన పార్టీ అధ్యక్ష ఎన్నికలపై మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17 న జరగనున్నాయి. అక్టోబర్ 19న ఓట్లు లెక్కించి , ఫలితాలు ప్రకటిస్తారు. రాహుల్ తదితరులు జోడో యాత్రలో ఉన్నందున బళ్లారి లోని యాత్ర క్యాంప్‌సైట్ లో ఏర్పాటు చేసే పోలింగ్ బూత్‌లో ఓటు వేస్తారు.