రాహుల్ గాంధీ చురకలు
న్యూఢిల్లీ: భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం తిప్పికొట్టారు. బిజెపి నాయకుడు అమిత్ షాకు బహుశ చరిత్ర గురించి తెలిసి ఉండదని, అందుకే ఆయన దాన్ని తిరగరాస్తూ ఉంటారని రాహుల్ ఎద్దేవా చేశారు. కుల గణన, ఎవరి చేతుల్లోకి దేశం సొమ్ము వెళుతోందో వంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇటువంటి అంశాలను తెరపైకి తెస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
సోమవారం రాజ్యసభలో అమిత్ షా మాట్లాడుతూ కశ్మీరు సమస్యకు జవహర్‌లాల్ నెహ్రూనే బాధ్యులని ఆరోపించారు. సమయం కాని సమయంలో కాల్పుల రిమరణ ప్రకటించడం, సమస్యను ఐక్యరాజ్యసమితికి తీసుకెళ్లడం వంటి పొరపాట్లు నెహ్రూ చేశారంటూ అమిత్ షా నిందించారు. ఈ వ్యాఖ్యలపై మంగళవారం విలేకరులు రాహుల్ స్పందన కోరగా నెహ్రూ తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారని, ఏళ్ల తరబడి జైల్లో మగ్గారని చెప్పారు. బహుశ అమిత్ షాకు చరిత్ర తెలిసి ఉండకపోవచ్చు. ఆయనకు చరిత్ర తెలిసి ఉంటుందని కూడా నేను భావించను. అందుకే ఆయన చరిత్రను తిరగరాస్తూ ఉంటారు అంటూ రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇదంతా అసలు సమస్యలను పక్కదారి పట్టించడానికేనని ఆయన అన్నారు. కుల గణన అన్నది ఇప్పుడు ప్రధాన అంశమని, ఎవరి చేతుల్లోకి దేశం సొమ్ము వెళుతోందో అన్న విషయం కూడా ప్రజల మనస్సులో ఉందని రాహుల్ అన్నారు. ఈ అంశాలను బిజెపి చర్చించదని, అందుకే భయపడి పారిపోతుంటుందని పార్లమెంట్ వెలుపల విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ అంశాలను కాంగ్రెస్ విచిచిపెట్టదని, ప్రజల హక్కుల కోసం పోరాటం సాగిస్తూనే ఉంటామని ఆయన చెప్పారు.
ఛస్‌స్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో గిరిజన, ఓబిసి ముఖ్యమంత్రులను బిజెపి నియమించడాన్ని గురించి ప్రశ్నించగా తాము కూడా ఛత్తీస్‌గఢ్‌లో ఓబిసి అభ్యర్థినే సిఎంగా నియమించామని ఆయన గుర్తు చేశారు. వారు(బిజెపి) కూడా మధ్యప్రదేశ్‌లో ఓబిసి అభ్యర్థినే సిఎం చేశారని, అదో సమస్యే కాదని ఆయన తేల్చేశారు. వ్యవస్థలో ఓబిసిల పాత్ర ఏమిటన్నదే ప్రధాన ప్రశ్నంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఓబిసి అయినప్పటికీ ప్రభుత్వం 90 మంది అధికారులతో నడుస్తుందని ఆయన అన్నారు. ఈ 90 మంది అధికారులలో ముగ్గురు మాత్రమే ఓబిసిలని, వారి కార్యాలయాలు కూడా ఒక మూలన ఉంటాయని రాహుల్ తెలిపారు. పరిపాలనా వ్యవస్థలో ఓబిసిల ప్రమేయం గురించే తాను ప్రశ్నిస్తున్నానని ఆయన అన్నారు. దళితులు, ఆదివాసీల పాత్ర ఏమిటన్నదే దేశం ముందున్న ప్రధాన ప్రశ్ని ఆయన చెప్పారు. ప్రధాన సమస్య నుంచి దృష్టి మళ్లించడానికే బిజెపి నెహ్రూ గురించో మరో వ్యక్తి గురించో మాట్లాడుతుందని రాహుల్ విమర్శించారు.