విద్వేష వ్యాఖ్యలపై రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం బిజెపి అగ్రనాయకత్వంపై విమర్శలు గుప్పించారు. తీవ్ర భావజాలమే బిజెపి మూల సిద్ధాంతమని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తున్న కొందరు బిజెపి సీనియర్ నాయకులు గతంలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రాహుల్ గుర్తు చేశారు. మొహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన బిజెపి అధికార ప్రతినిధులు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్‌పై కువైట్, ఖతర్ ప్రభుత్వాలు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయా దేశాలలోని భారత రాయబారులు ఈ ఇద్దరు బిజెపి నాయకులను తీవ్రభావజాల శక్తులుగా అభివర్ణించారు.
దీనిపై రాహుల్ స్పందిస్తూ తీవ్ర భావజాలమే బిజెపి మూల సిద్ధాంతమని వ్యాఖ్యానించారు. గతంలో బిజెపి నాయకులు అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, అనురాగ్ ఠాకూర్, సాధ్వి ప్రజ్ఞ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తాకథనాలను రాహుల్ తన ట్వీట్‌తో జతచేశారు. బంగ్లాదేశీ వలసవాదులను చెదపురుగులుగా అమిత్ షా వర్ణించగా, మహిళలకు స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించే సామర్ధం లేదని యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించినట్లు ఆ వార్తలు ఉటంకించాయి. దేశ ద్రోహులను కాల్చిపారెయ్యాలి అంటూ అనురాగ్ ఠాకూర్, నాథూరాం గాడ్సేను కీర్తిస్తూ సాధ్వి ప్రజ్ఞ చేసిన వ్యాఖ్యలను రాహుల ప్రస్తావించారు.