మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను శనివారం ఢిల్లీ నిగమ్‌బోధ్ ఘాట్ వద్ద నిర్వహించడం వివాదానికి దారి తీసింది. మాజీ ప్రధానిని, సిక్కు సమాజాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ‘పూర్తిగా అవమానించింది’ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇతర నేతలకు ప్రత్యేక అంత్యక్రియల ప్రదేశాలు కేటాయించిన సందర్భాలను రాహుల్ ఉటంకించారు. కాంగ్రెస్ రాజకీయాలకు పాల్పడుతోందని బిజెపి ఆరోపించింది. మన్మోహన్ సింగ్‌ను ‘ఎన్నడూ గౌరవించని’ కాంగ్రెస్ ‘ఆయన మరణం తరువాత రాజకీయాలకు పాల్పడడం శోచనీయం’ అని బిజెపి సీనియర్ నేత సుధాంశు త్రివేది అన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి, పివి నరసింహారావు సహా గాంధీయేతర నేతలకు కాంగ్రెస్ ఎన్నడూ సముచిత గౌరవం ఇవ్వలేదని త్రివేది ఆరోపించారు. సింగ్ స్మారకచిహ్నానికి ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు, సింగ్ కుటుంబానికి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే వర్తమానం పంపినట్లు హోమ్ మంత్రిత్వశాఖ శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఒక ప్రకటన జారీ చేయడం ద్వారా కాంగ్రెస్ ఆరోపణను ఖండించిన తరువాత,
సింగ్ అంత్యక్రియలు జరిగిన కొన్ని గంటల తరువాత రాహుల్ ఆ వ్యాఖ్యలు చేశారు. ఖర్గే శుక్రవారం ఉదయం సింగ్ కుటుంబాన్ని సంప్రదించిన పిమ్మట స్మారకచిహ్నం ఏర్పాటయ్యే చోట అంత్యక్రియలు నిర్వహించవలసిందని ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. అయితే, ఆ డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించలేదు. దీనితో ‘దేశ తొలి సిక్కు ప్రధాని’ని అధికార బిజెపి అవమానించిందని కాంగ్రెస్ ఆరోపించింది. సింగ్‌ను ‘భారత మాత్ర గొప్ప పుత్రుడు, సిక్కు సమాజం నుంచి తొలి ప్రధాని’ అని రాహుల్ అభివర్ణిస్తూ, శనివారం నిగమ్‌బోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వం ఆయనను పూర్తిగా అవమానించింది’ అని ఆరోపించారు. ‘ఇప్పటి వరకు మాజీ ప్రధానులు అందరినీ గౌరవిస్తూ, ప్రతి ఒక్కరూ ఏమాత్రం అసౌకర్యం లేకుండా అంతిమ దర్శనం చేసుకుని, శ్రద్ధాంజలి ఘటించేందుకు వీలుగా అధీకృత శ్మశాన వాటికల్లో వారి అంత్యక్రియలు నిర్వహించడమైంది’ అని ఆయన తెలిపారు. సింగ్ అత్యధిక గౌరవానికి, స్మారక చిహ్నానికి అర్హుడని రాహుల్ పేర్కొన్నారు. ‘దేశ మహోన్నత పుత్రునికి, ఆయనకు గర్వకారణమైన సమాజానికి ప్రభుత్వం మన్నన చూపి ఉండవలసింది’
అని రాహుల్ అన్నారు. ప్రధానిగా సింగ్ హయాంలో భారత్ ఆర్థిక అగ్ర రాజ్యం అయిందని, ఆయన విధానాలకు ఇప్పటికీ దేశంలోని నిరుపేదలు, వెనుకబడిన తరగతుల మద్దతు లభిస్తోందని రాహుల్ గుర్తు చేశారు. కాగా, కాంగ్రెస్ లోక్‌సభ విప్ మాణిక్కం ఠాగూర్ 2016లో మాజీ ప్రధాని ఎబి వాజ్‌పేయి అంత్యక్రియల ఫుటేజ్‌ను పంచుకుంటూ, ‘ఆ విధంగా ప్రవర్తించడం ఎంతో బాధిస్తోంది’ అని అన్నారు. ప్రజల ఒత్తిడితోనే బిజెపి ప్రభుత్వం భవిష్యత్తులో ఒక స్మారకచిహ్నం నిర్మించాలనే ఆలోచన ఉన్నట్లు ప్రకటించిందని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించారు.