దేశ స్వాతంత్య్రం విషయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ విరుచుకుపడ్డారు. ఆయన రాజ్యాంగ విరుద్ధంగా వ్యాఖ్యానించారని మండిపడ్డారు. బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన“ సంవిధాన్ సురక్ష సమ్మేళన్ ” కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. “ బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అణగారిన వర్గాలను నిర్లక్షం చేస్తున్నాయి. మైనారిటీ, దళితులు, రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ వారికి ఎలాంటి అధికారాలు ఉండడం లేదు. ఆర్ఎస్ఎస్ సహా మరికొన్ని సంస్థలే దేశాన్ని నడుపుతున్నాయి. దేశ సంపద కొందరు పారిశ్రామిక వేత్తల చేతుల్లోనే ఉంది. భారత రాజ్యాంగం ఒక పుస్తకం మాత్రమే కాదని, దళితులు ఎదుర్కొన్న అన్యాయాల గురించి అది మాట్లాడుతుంది. ” అని రాహుల్ పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా కులగణన కచ్చితంగా అవసరమని, ఇది అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తుందని, రాహుల్ అన్నారు. కాగా, ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్వాతంత్య్రం విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన రోజునే భారత్ నిజమైన స్వాతంత్య్రాన్ని పొందిందన్నారు. శత్రువులతో భారత్ ఎన్నో శతాబ్దాల పాటు పోరాడిందని, అయితే రామమందిర ఉద్యమం ఎవరినీ వ్యతిరేకించడానికి ప్రారంభించింది కాదన్నారు. దేశం తనను తాను మేలుకొల్పుకోవడానికి చేసింది మాత్రమేనని అన్నారు. భారత్ తన కాళ్లపై నిలిచి ప్రపంచానికి మార్గం చూపుతుందని, రామమందిర ప్రతిష్ఠాపన సందర్భంగా దేశంలో ఎలాంటి అసమ్మతి చోటుచేసుకోలేదన్నారు. ఈ వ్యాఖ్యలపై రాహుల్ తీవ్రంగా స్పందించారు. మోహన్‌భగవత్ రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడారని విమర్శించారు.